
చెన్నై: ముఖ్యమంత్రి గా బాధ్యతల నిర్వహణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆ పదవికే వన్నె తెస్తున్న తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ శనివారం సిటీ బస్సు ఎక్కారు. ఆకస్మిక తనిఖీ కోసం బస్సు ఎక్కిన ఆయన ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చట జరిపారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని కన్నాగి ప్రాంతంలో ఉన్న ఒక వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన వారితో.. ఆస్పత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి బయటకు వచ్చారు. అయితే అదే సమయంలో ఆర్టీసీ బస్సు రావడం గమనించిన సీఎం స్టాలిన్.. తన కాన్వాయ్ ను ఆపి సిటీ బస్సులో ఎక్కారు. సీఎం స్వయంగా బస్సు ఆపడంతో డ్రైవర్.. కండక్టర్ ఆశ్చర్యపోగా.. ప్రయాణికుల సంగతి సరేసరి. సీఎం స్టాలిన్ తమ మధ్యలోకి వచ్చేసరికి ఆయనతో సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సందడి చేశారు.
ఈ సందర్భంగా బస్సులో ప్రయాణాల గురించి, ఇతర సమస్యల గురించి సీఎం స్టాలిన్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.
మహిళలకు ఉచిత టికెట్లు ఇస్తున్నారా..? బస్సులు సరిగ్గా నడుస్తున్నాయా..? అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు మాస్కులు పెట్టుకోకుండా ప్రయాణించడం గమనించిన సీఎం స్టాలిన్.. అందరూ తప్పనిసరిగా.. మాస్కులు ధరించాలని సూచించారు. సీఎం స్టాలిన్ సిటీ బస్సులో పర్యటించిన ఘటన వీడియోను సీఎం కార్యాలయం ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది.