రిటైర్డ్​ ఆఫీసర్లకు పోస్టింగ్​లు

రిటైర్డ్​ ఆఫీసర్లకు పోస్టింగ్​లు
  • సీఎం ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్​ శ్రీనివాసరాజు
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్​గా కమలాసన్ రెడ్డి
  • రిటైర్ అయిన సీఎస్​కు ఎంసీహెచ్​ఆర్డీ వైస్ చైర్మన్, డీజీగా పోస్టింగ్​

హైదరాబాద్​, వెలుగు: రిటైర్డ్ అవుతున్న ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టింగ్​లు ఇస్తున్నది. రీ అపాయింట్​మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్​ శ్రీనివాసరాజు సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. రెండేళ్లపాటు ఆయన ముఖ్యకార్యదర్శిగా ఉంటారని జీవోలో పేర్కొన్నారు. ఇక ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్ గా రిటైర్​అయిన ఐపీఎస్ కమలాసన్ రెడ్డికి కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. 

ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్​కు ఓఎస్డీగా నియమించడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎస్​గా రిటైర్ అయిన శాంతి కుమారికి సైతం ప్రభుత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ ఆర్డీఐ) వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ (ఎఫ్ఏసీ)గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే టీఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్​ డైరెక్టర్​గా రిటైర్డ్ ఈఎన్సీ గణపతి రెడ్డి ఇదివరకే ప్రభుత్వం నియమించింది.   

సీఎంవో నుంచి ఒక్కొక్కరుగా ఖాళీ

ఇక సీఎంవోలో 4  పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇందులో సీఎంవో జాయింట్ సెక్రటరీని సంగీత సత్యనారాయణను ప్రభుత్వం హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్​గా నియమించింది. మరొక సీఎం సెక్రటరీ షాన్​వాజ్ ఖాసీంను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్​గా అపాయింట్ కానున్నారు. మరొక పోస్టు సీఎం సీపీఆర్వో కూడా ఖాళీ కానున్నది. సీపీఆర్వో అయోధ్య రెడ్డిని ప్రభుత్వం సమాచార కమిషనర్​గా నియమించనున్నది. దీంతో ప్రధాన పోస్టులన్నీ మారనున్నాయి.