సీజన్​కు ముందే యూరియా కొరత!.. రాష్ట్రంలో పెరుగుతున్న వాడకమే కారణం

సీజన్​కు ముందే యూరియా కొరత!..  రాష్ట్రంలో పెరుగుతున్న వాడకమే కారణం
  • వరి, మక్క పంటకు విరివిగా వినియోగం
  • భూసారం దెబ్బతింటున్నదన్న వ్యవసాయ నిపుణులు
  • ఎరువుల కోటాను కుదించిన కేంద్ర సర్కార్ 
  • మేలో రాష్ట్రానికి కేటాయించింది 50వేల టన్నులే..
  • మెయింటెనెన్స్ కారణంగా ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్​లో నిలిచిన ఉత్పత్తి.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎరువులు, యూరియా వాడకం పెరుగుతున్నది. వరి, మక్క సాగులో యూరియా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతింటున్నదని నిపుణులు అంటున్నారు. ఈ వానాకాలం సీజన్​లో యూరియా అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. అయితే, కేంద్రం నుంచి సరిపడా కేటాయింపులు లేకపోవడం, స్థానిక ఉత్పత్తిలో సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. 

ఈ వానాకాలంలో రాష్ట్రానికి 12 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం కేవలం 9.80 లక్షల టన్నులే కేటాయించింది. సుమారు 2.2 లక్షల టన్నుల కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేలో కేంద్రం నుంచి 1.50 లక్షల టన్నులు కేటాయించాల్సి ఉండగా, కేవలం 50 వేల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. రాష్ట్రంలో బఫర్ స్టాక్‌‌‌‌లు కూడా 2 లక్షల టన్నుల కంటే తక్కువగా ఉన్నాయి.

సాగు విస్తీర్ణం పెరుగుదల 

రాష్ట్రవ్యాప్తంగా గత వానాకాలంలో 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్‌‌‌‌లో 1.34 కోట్ల ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 66.80 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 6 లక్షల ఎకరాల్లో, కంది 5.50 లక్షల ఎకరాల్లో, సోయా 4.50 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉంది. 

సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 2014-–15 నుంచి 2024–25 వరకు రాష్ట్రంలో ఎరువుల వినియోగం 11.70 లక్షలకు టన్నులు పెరిగింది. 2024–25 నాటికి మొత్తం ఎరువుల వినియోగం 45 లక్షల టన్నులు దాటింది. ఇందులో యూరియా వినియోగం 20 లక్షల టన్నులకు పైగానే ఉంటున్నది.

ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో ఉత్పత్తి సమస్యలు 

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్)లో వార్షిక మరమ్మతుల కారణంగా మే 6 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. హెచ్‌‌‌‌టీఆర్ (హీట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ రిఫార్మర్), అమ్మోనియా పైప్‌‌‌‌లైన్‌‌‌‌లు, ఇతర యంత్రాల నిర్వహణ కోసం ఈ రిపేర్లు చేపట్టారు.  జూన్ రెండో వారంలో ఉత్పత్తి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతేడాది ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్ 11.94 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేసి, రాష్ట్రానికి 4.68 లక్షల టన్నులు సరఫరా చేసింది. 

మిగిలిన యూరియాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. కాగా, రోహిణి కార్తెకి ముందే వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో వానాకాలం సీజన్ ముందస్తుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూన్ ప్రారంభం నుంచే శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో సాగు మొదలవుతుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతున్నది. పచ్చిరొట్ట, కంపోస్ట్ ఎరువుల వాడకాన్ని పెంచాలని నిర్ణయించింది.

కేంద్రం కోతలు, సబ్సిడీ భారం తగ్గించే ప్రయత్నం

కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ‘పీఎం- ప్రణామ్’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రాలు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించినట్లయితే, సబ్సిడీ మొత్తాన్ని ఇతర అవసరాలకు కేటాయిస్తామని కేంద్రం పేర్కొన్నది. అయితే, ఈ చర్యలు సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమనే విమర్శలు ఉన్నాయి. నిరుడు కేంద్రం ఎరువుల సబ్సిడీ కోసం రూ.2.25 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.