
- వెయ్యి స్తంభాల గుడి నుంచే సర్కారు సంబురాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూల పండుగ షురూ అయ్యింది. ఓరుగల్లు కేంద్రంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఆడబిడ్డలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వచ్చి ఆడిపాడారు. రూరల్ జిల్లాల పరిధిలోని ఆలయాల్లో తంగేడు, గునుగు పూల మధ్య గౌరమ్మను పెట్టి కొలిచారు. నగరంలో మహిళలు, యువతులు సంప్రదాయ చీరకట్టుతో ‘బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో’ అంటూ ఆడిపాడారు.
గ్రేటర్ సిటీలో వెయ్యి స్తంభాల గుడి కేంద్రంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించడం ఉమ్మడి జిల్లాకు మరింత గౌరవం దక్కినట్లయింది. ఏకంగా ఐదుగురు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొనడంతో ఓరుగల్లు బతుకమ్మకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. – వరంగల్, వెలుగు