ఇంకా పరిష్కారం కాని వీఆర్ఏల సమస్యలు

ఇంకా పరిష్కారం కాని వీఆర్ఏల సమస్యలు

హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్ఏల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీఆర్ఏల  పరిస్థితి అయోమయంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వీఆర్ఏల డిమాండ్లు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీఆర్ఏ ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ఉపఎన్నిక ముగిసిన తెల్లారి డిమాండ్ లు పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఇప్పటి వరకు కనీసం వారిని  పిలవలేదు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక.. ఎవరిని కలవాలో అర్థం కాక వీఆర్ఏలు ఆగమాగం అవుతున్నారు.

83 రోజులు సమ్మె చేసి..

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 83 రోజులకు పైగా వీఆర్ఏలు సమ్మె చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రావడంతో ప్రభుత్వం దిగి వచ్చి వీఆర్ఏలను చర్చలకు ఆహ్వానించింది. మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రెటరీ  సోమేష్ కుమార్ రెండు దఫాలుగా వరుసగా వారితో చర్చలు జరిపారు. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే  వీఆర్ఏల సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో వీఆర్ఏలు సమ్మె విరమణ చేశారు. కానీ మునుగోడు ఉప ఎన్నిక ముగిసి  రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వీఆర్ఏల సమస్యలు పరిష్కారం కాలేదు. తమ డిమాండ్ల పరిస్థితి ఏమిటి..? తమ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు.. అని నేతల చుట్టూ తిరుగుతున్నా.. అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని వీఆర్ఏలు వాపోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మందికిపైగా వీఆర్ఏలు ఉన్నారు. పే స్కేల్ అమలు, అర్హులైన వారికి పదోన్నతులు, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కు సర్వీస్ పెన్షన్ సదుపాయం, వారసులకు ఉద్యోగాల నియామకం కల్పించాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు కారుణ్య నియామకం ద్వారా 20వేల మంది, ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 3వేల మంది అందులో సుమారు 60శాతం మహిళలు నియామకం అయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన సుమారు 36 రకాల విభాగ అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందించి వారికి అండగా ఉంటారు. కానీ వీఆర్ఏలు సమ్మె చేయడంతో చాలా వరకు గ్రామాలలో జనాలు ఇబ్బంది పడుతున్నారు.

వీఆర్ఏలకు సర్వీస్ పరంగా పదవ తరగతి ఉత్తీర్ణతతో అటెండర్, నైట్ వాచ్మెన్, జీప్ డ్రైవరు పదోన్నతి సదుపాయాలు ఉన్నాయి.. కానీ కొత్త జిల్లాలు కొత్త డివిజన్ల ఏర్పాటు జరగడం వల్ల డివిజన్ పరిధి విషయంలో పాత జిల్లా డివిజన్ ని పరిగణలోకి తీసుకోవాలో లేక కొత్త డివిజన్ పరిధి లోకి తీసుకోవాలో తెలవక పదోన్నతి ప్రక్రియ చేపట్టడం లేదు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారికి వీఆర్వోగా పదోన్నతి కల్పించాలి. కానీ కొత్త రెవెన్యూ చట్టంతో  వీఆర్వో వ్యవస్థ రద్దయి పదోన్నతి అవకాశం కోల్పోయారు. 

దీంతో వీఆర్ఏలకు పే స్కేలు లేదు, పిఎఫ్ లేదు, మెటర్నిటీ సెలవులు లేవు, ఈఎస్ఐ లేదు, హెల్త్ కార్డ్స్ లేవు,  పెన్షన్ లేవు, ఉద్యోగ భద్రత లేదు,  సమయ పాలన లేదు,  పదోన్నతులు లేవు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న  ప్రభుత్వం ఎన్నికలు ముగిసి రోజులు.. వారాలు గడుస్తున్నా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో వీఆర్ఏల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం  ముందుకు వచ్చి తమ సమస్యలు పరిష్కారం చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు.