ఏపీ వడ్లు తెస్తున్న 8 లారీలు పట్టివేత

ఏపీ వడ్లు తెస్తున్న 8 లారీలు పట్టివేత
  • 14 మందిపై కేసు నమోదు
  • తెలంగాణ సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు

మిర్యాలగూడ, వెలుగు: ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నల్గొండ జిల్లా వాడపల్లి మీదుగా మిర్యాలగూడ ప్రాంతానికి లారీలు, ఐచర్​లలో తరలిస్తున్న సన్న వడ్లను పోలీసులు పట్టుకున్నారు. శనివారం మిర్యాలగూడ రూరల్  పీఎస్ లో డీఎస్పీ రాజశేఖర రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని నరసరావుపేట, ప్రకాశం, ఒంగోలు జిల్లాల నుంచి వడ్లను మిర్యాలగూడకు  తరలిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు మద్దతు ధర, బోనస్  ఇస్తుండడంతో, వాటిని పొందేందుకు ఏపీకి చెందిన కొంత మంది దళారులు వడ్లను రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. 

15 రోజుల కింద వడ్లు రాకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్  చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, అయితే అక్రమ మార్గంలో తెలంగాణలోకి వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 100కు పైగా లారీలను బార్డర్  నుంచి వెనక్కి పంపించామని తెలిపారు. 7 లారీలతో పాటు ఐచర్  వాహనంలో తరలిస్తున్న వడ్లను పట్టుకున్నామని, 14 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. సన్న వడ్లు కొనుగోలు సీజన్  ముగిసేంత వరకు తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. రూరల్  సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్సైలు లక్ష్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.