
- ఇంటర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన
- రినోవేషన్ పనులతో ఇంటర్ కాలేజీలకు కొత్తరూపు
- త్వరలో ప్రారంభం కానున్న పనులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇటీవల ఫండ్స్ మంజూరు చేసింది. ఈ నిధులతో కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందనుంది. దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి రూ.6.23కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.6.23కోట్లు విడుదల
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 48 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో రినోవేషన్పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.6.23కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 10 కాలేజీల కోసం రూ. 1.80కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 12 కాలేజీల కోసం రూ.2.6 కోట్లు, జగిత్యాల జిల్లాలో 16 కాలేజీల కోసం రూ.1.08కోట్లు, కరీంనగర్ జిల్లాలో 10 కాలేజీలు ఉండగా రూ.1.29 కోట్లు మంజూరు చేశారు. వీటితో ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా వీటిల్లో చాలావరకు మౌలిక వసతుల కొరత ఉంది. కాలేజీ బిల్డింగ్ రిపేర్లు, టాయిలెట్స్, కరెంట్, తాగునీటి సరఫరా పనులు చేపట్టనున్నారు. క్లాసు రూముల్లో గ్రీన్ చాక్ బోర్డు, డ్యూయల్ డెస్క్ లు, బిల్డింగ్స్‌కు పెయింటింగ్ వేయనున్నారు. వీటితోపాటు కాలేజీల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య
పెరగనుంది.