బనకచర్లకు పోటీగా ఇచ్చంపల్లి!..ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం

బనకచర్లకు పోటీగా ఇచ్చంపల్లి!..ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం
  • గోదావరి–కావేరి లింక్‌‌‌‌లో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన 
  • అందులో 200 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్  
  • త్వరలోనే వ్యాప్కోస్‌‌‌‌తో ప్రీ ఫీజిబిలిటీ సర్వే చేయించే యోచన
  • ఇక్కడ 340 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు 1986 నాటి సర్వేలోనే వెల్లడి
  • ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తే 200 టీఎంసీలపై హక్కులు వస్తాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  • జీసీ లింక్‌‌‌‌లో భాగంగా నిర్మిస్తే 90 శాతం ఖర్చు కూడా కేంద్రానిదే.. 
  • మిగతా 10 శాతమూ లింక్‌‌‌‌లో భాగమైన అన్ని రాష్ట్రాలు భరించాల్సిందే..

హైదరాబాద్, వెలుగు: ఏపీ తలపెట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు పోటీగా రాష్ట్ర సర్కార్ ఇచ్చంపల్లిని తెరపైకి తెస్తున్నది. గోదావరి–-కావేరి లింక్‌‌‌‌లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తున్నది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా బనకచర్ల లింక్‌‌‌‌తో ఏపీ 200 టీఎంసీలు తరలిస్తే.. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అందులో 200 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై మరోసారి ప్రీ ఫీజిబిలిటీ సర్వే చేయించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టు ఎంత ఎత్తులో కట్టొచ్చు, ఎంత ఖర్చవుతుంది, ముంపు ప్రభావం, లిఫ్ట్‌‌‌‌ల అవసరం తదితర అంశాలపై సర్వే చేయించాలని భావిస్తున్నది. కాగా, గోదావరి–కావేరి లింక్‌‌‌‌లో భాగంగా ఇచ్చంపల్లి నుంచే నీటిని తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బనకచర్లకు స్ట్రాంగ్‌‌‌‌గా కౌంటర్​ఇవ్వాలంటే జీసీ లింక్‌‌‌‌లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించాలన్న డిమాండ్‌‌‌‌ను రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ బలంగా ముందుకు తీసుకెళ్తున్నది. త్వరలో ప్రీ ఫీజిబిలిటీ సర్వే 
బాధ్యతలను వ్యాప్కోస్‌‌‌‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్టు తెలిసింది. 


ఇచ్చంపల్లి ప్రాజెక్టు అంశం ఇప్పటిది కాదు. 1980ల్లోనే ఆ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు వచ్చా యి. గోదావరి జలాల పంపిణీలో భాగంగా బచావత్​ ట్రిబ్యునల్.. ఉమ్మడి ఏపీకి తెలంగాణలో ఇచ్చంపల్లి, ఏపీలో పోలవరం, ఉమ్మడి మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుబోధ్​ఘాట్, మహారాష్ట్రకు మరో ప్రాజెక్టును కేటాయిస్తూ అవార్డు ఇచ్చింది. ఇచ్చంపల్లి వద్ద 1986లోనే సర్వే చేయగా, అక్కడ దాదాపు 340 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తేలింది. ఆ జలాలను వాడుకునేందుకు బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చిం ది. కానీ, ఆ ఎత్తుతో అక్కడ బ్యారేజీని నిర్మిస్తే.. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మహారాష్ట్రలో ముంపు సమస్య తీవ్రంగా ఉంటుందన్న అభ్యంతరాలను ఆ రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. అదే క్రమంలో 108 మీటర్ల ఎత్తుకు కుదించేందుకు అంగీకారం తెలిపినా.. మధ్యప్రదేశ్ అభ్యంతరాలతో 105 మీటర్లకు తగ్గించారు. ఈ ప్రాజెక్ట్​పై 2016 వరకు చర్చలు కొనసాగినా.. ఆ తర్వా త దాన్ని మూలకు పడేశారు. ఆ ప్రాంతం లోతైన లోయ గా ఉండడం, డెడ్​స్టోరేజీనే ఎక్కువగా ఉండడం వం టి కారణాలతో అప్పటి ఇరిగేషన్​ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్​ఇచ్చంప ల్లి వద్ద ప్రాజెక్ట్​కన్నా వేరేచోట నిర్మించుకోవాలని సూచించారు. 105 మీటర్లకుపైన కడితేనే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయని, లేదంటే లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పెట్టుకోవాల్సిందేనని తేల్చారు. ఆ ఎత్తుతోనూ అక్కడి నుంచి 120 టీఎంసీలకు మించి నీటిని తీసుకోవడానికి వీలు లేకపోవడంతో 2016లో నాటి కేసీఆర్ ​ప్రభుత్వం దాన్ని వదిలేసింది. 

జీసీ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మళ్లీ తెరపైకి..

వాస్తవానికి గోదావరి–కావేరి లింకింగ్ ​ప్రాజెక్టును​1982లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2019లో మోదీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అదే ఏడాది నేషనల్ ​వాటర్​డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ఏజెన్సీడీటెయిల్డ్​ప్రాజెక్ట్ ​రిపోర్టు (డీపీఆర్) సమర్పించింది. దాన్ని సంబం ధిత రాష్ట్రాలకు పంపించింది. 87 మీటర్ల ఎత్తుతో 15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించాలని ప్రతిపాదించింది. తద్వారా చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​ వాడుకోని నికర జలాల్లో 148 టీఎంసీలను తరలించాలని ప్రపోజ్​ చేసింది. కానీ, గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని రాష్ట్రాలూ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలుపుతూ వస్తున్నాయి. ఇక, ఇప్పటికే తెలంగాణలో సమ్మక్కసాగర్​ బ్యారేజీ ఉండడంతో.. అక్కడి నుంచి తీసుకోవాలని గత ప్రభుత్వం నుంచీ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. దాంతోపాటు గేట్ల ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని, ఇచ్చంపల్లి వద్ద కడితే సమ్మక్క సాగర్​బ్యారేజీ (తుపాకులగూడెం) మధ్య 27 కి.మీ. దూరమే ఉంటుంది కాబట్టి.. వచ్చే వరదను నియంత్రించే పరిస్థితులు ఉండవన్న వాదన ఉంది. దాంతో పాటు దేవాదుల, సీతమ్మ సాగర్ ​వంటి ప్రాజెక్టుల కు నీటి కేటాయింపులపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది.  

మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే, దాన్ని మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చన్న భావనలోనూ ప్రభుత్వం ఉందన్న చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలోనే బనకచర్లపై ఏపీ దూకుడును తగ్గించేలా.. మన ప్రభుత్వం కూడా ఇచ్చంపల్లిపై దూకుడుగా వెళ్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగా దీనిపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నదని తెలుస్తున్నది. అయితే, కేంద్రం ప్రతిపాదించినట్టుగా 87 మీటర్లకు కాకుండా.. వంద మీటర్లకు పైగా ఎత్తుతో బ్యారేజీని నిర్మించేలా డిమాండ్​చేసే అవకాశాలున్నాయి.

మన హక్కు కోసం ఫైట్​..

ఏపీకి గట్టిగా కౌంటర్​ ఇచ్చేలా.. 200 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచే తమకు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ పట్టుబడుతున్నది. తద్వారా ఆ 200 టీఎంసీలపై హక్కు సాధించి వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నది. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్​ కాబట్టి.. ఎలాగూ 90 శాతం నిధులను కేంద్రమే భరించాల్సి ఉంటుంది. మిగతా పది శాతం ఖర్చును లింక్‌‌‌‌లో భాగమైన అన్ని రాష్ట్రాలూ సమానంగా భరించాల్సి ఉంటుంది. ఈ పదేండ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలేవీ లేకపోవడంతో.. ఈ విధంగానైనా సహకరించాలని ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్నారు.