హైదరాబాద్ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఊహించని ఘోరం..కృష్ణుని రథానికి కరెంట్ షాక్..ఐదుగురు మృతి

హైదరాబాద్ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఊహించని ఘోరం..కృష్ణుని రథానికి కరెంట్ షాక్..ఐదుగురు మృతి

హైదరాబాద్లోని రామంతపూర్లో ఘోరం జరిగింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శోభాయాత్రలో రథం లాగుతుండగా భక్తులకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలింది.ఐదుగురు భక్తులు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  అర్థరాత్రిదాకా భక్తితో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని ఆలయం లోపలికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండుగ వేళ ఐదుగురు భక్తులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. 

హైదారాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్‌లోని యాదవ్ సంగం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకృష్ణుడు విగ్రహం కలిగిన రథం బండి ఊరేగింపు ముగించి లోపలికి రథాన్ని తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలడంతో భక్తులు విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని యశోద, కేర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతులు కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేందర్ రెడ్డి(39)లుగా గుర్తించారు.