కోహ్లీ ఫోన్‌‌ స్విచాఫ్‌‌ చేసిండు

కోహ్లీ ఫోన్‌‌ స్విచాఫ్‌‌ చేసిండు

ముంబై: రోహిత్‌‌శర్మను టీమిండియా వన్డే కెప్టెన్‌‌గా చేసిన విధానంలో బీసీసీఐ తీరు సరిగా లేదని విరాట్‌‌ కోహ్లీ చిన్న నాటి కోచ్‌‌ రాజ్‌‌కుమార్‌‌ శర్మ అన్నాడు. ఈ విషయంలో విరాట్‌‌ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు ఉన్నాడని,  బీసీసీఐ ప్రకటన వచ్చిన రోజు నుంచి అతని ఫోన్‌‌ స్విచాఫ్‌‌లో ఉందని పేర్కొన్నాడు. ‘విరాట్‌‌తో నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు. కారణం తెలియదు కానీ అతని ఫోన్‌‌ ఆఫ్‌‌లో ఉంది. విరాట్‌‌ టీ20 కెప్టెన్సీని మాత్రమే వదులుకున్నాడు. వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాలనో లేదంటే,  కెప్టెన్‌‌గా కొనసాగమనో సెలెక్టర్లు అప్పుడే  కోహ్లీని అడిగి ఉండవచ్చు. మరోపక్క, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోహ్లీని వరల్డ్‌‌కప్‌‌ అప్పుడే  రిక్వెస్ట్‌‌ చేశామని సౌరవ్‌‌ గంగూలీ ఇటీవల చెప్పాడు. అలాంటి విషయం ఒకటి జరిగిందని నేనైతే ఎక్కడా వినలేదు. అందువల్ల గంగూలీ ప్రకటన నన్ను ఆశ్చర్యపరిచింది. జరిగిందంతా చూస్తే చాలా వింతగా అనిపిస్తోంది.  ఎందుకంటే వన్డేల్లో విరాట్‌‌ చాలా సక్సెస్‌‌ఫుల్‌‌ కెప్టెన్‌‌. అలాంటి వ్యక్తిపై ఎందుకు వేటు వేశారో సెలెక్టర్లు నుంచి సరైన ప్రకటన కూడా లేదు. టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, బోర్డు, సెలెక్టర్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎందులోనూ క్లారిటీ లేదు. పారదర్శకత కనిపించడం లేదు’ అని రాజ్‌‌కుమార్‌‌ పేర్కొన్నాడు.