లిక్కర్​ తయారీకి చారానా...సర్కారు బాదుడు బారానా

లిక్కర్​ తయారీకి చారానా...సర్కారు బాదుడు బారానా
  • ఒక్కో బాటిల్​పై 70 శాతానికి పైగా ట్యాక్సులు

రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఓ కంపెనీ బీరు (650 ఎంఎల్) తయారీ ఖర్చు కేవలం రూ.22.50. ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా దీంట్లనే కలిపి ఉంటయ్. వైన్ షాప్ రిటైల్ మార్జిన్ రూ.18.50 ఈ రెండింటిని కలిపినా మొత్తం 41 రూపాయలే. కానీ.. ఒక్కో బీరు ఎమ్మార్పీ రూ.140 చొప్పున మార్కెట్లో అమ్ముతున్నరు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో రూ.99 వస్తున్నయ్
హైదరాబాద్, వెలుగు:
లిక్కర్​పై రాష్ట్ర సర్కారు ఎడా పెడా పన్నులు వేస్తున్నది. వ్యాట్, ఎక్సైజ్​ డ్యూటీ, స్పెషల్​ డ్యూటీ, సెస్​ పేర్లతో కస్టమర్ల నుంచి అందినకాడికి దండుకుంటున్నది. మందు తయారీ ఖర్చుకు, అమ్మే రేటుకు జమీన్​ ఆస్మాన్​ ఫరక్​ ఉంటున్నది. సందు దొరికినప్పుడుల్లా లిక్కర్​ రేట్లను సర్కారు పెంచుతూ పోతున్నది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఒక్కో బ్రాండ్‌‌పై రూ. 40 నుంచి రూ. 50 ఎక్కువ తీసుకుంటున్నది. ఇట్ల తాగేటోళ్ల నుంచి నిరుడు, మోయేడు కలిపి ట్యాక్స్‌‌లతోనే రూ. 38 వేల కోట్లకుపైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 
ట్యాక్సులపై సీక్రెట్​
ఒక్కో బ్రాండ్‌‌, ఒక్కో బాటిల్‌‌పై ఒక్కో తీరుగా రాష్ట్ర సర్కారు ట్యాక్సులు వసూలు చేస్తున్నది. చీప్​ లిక్కర్‌‌ బ్రాండ్లపై 80 శాతం దాకా,  ప్రీమియం బాండ్లపై 70 శాతానికి పైగా ట్యాక్సులు వేస్తున్నది. 650 ఎంఎల్​ బీరు తయారీకి రూ. 22.50 ఖర్చయితే.. దాన్ని రూ.140కి అమ్ముతున్నారు. ఇందులో వైన్​ షాపు రిటైలర్​ మార్జిన్​ పోను మిగతా 70 శాతానిపైగా డబ్బులు ( రూ. 99) పన్నుల రూపంలో రాష్ట్ర సర్కారు ఖజానాకు చేరుతున్నాయి. ఓ ప్రముఖ డిస్టిలరీ కంపెనీ విస్కీ ఫుల్​ బాటిల్​ను  రూ. 119.21కు సప్లయ్​ చేస్తుంటే.. దాన్ని రూ. 800 ఎమ్మార్పీపై ప్రభుత్వం అమ్మిస్తున్నది. ఇందులో వైన్​షాపు రిటైలర్​ మార్జిన్​  రూ. 111.68 పోగా..  ట్యాక్సుల పేరిట ప్రభుత్వం రూ.569 గుంజుతున్నది. వ్యాట్​, ఎక్సైజ్‌‌ డ్యూటీ, స్పెషల్‌‌ ఎక్సైజ్‌‌ డ్యూటీ, అడిషనల్‌‌ ఎక్సైజ్‌‌ డ్యూటీ, స్పెషల్ సెస్‌‌, స్పెషల్‌‌ ప్రివిలేజ్‌‌ ఫీజు.. ఇట్ల రకరకాల పేర్లు పెట్టి ఆమ్దానీ రాబట్టుకుంటున్నది. బ్రాండ్లపై పైసా అటు ఇటు ఉన్నా రౌండ్​ ఫిగర్​కు రేటును ఫిక్స్​ చేస్తున్నది. అటు అమ్మెటోళ్లకు, ఇటు తయారు చేసెటోళ్లకు కూడా ట్యాక్స్‌‌లు ఎట్ల వేస్తరో తెలియకుండా సీక్రెట్​ను  మెయింటెన్‌‌  చేస్తున్నది. 
నాలుగు సార్లు రేట్లు పెంచిన్రు
ఆబ్కారీ ఆదాయమే లక్ష్యంగా సర్కారు ముందుకు పోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏడేండ్లలో నాలుగు సార్లు మద్యం రేట్లను పెంచింది. 2015లో 8 శాతం, 2017లో 10 శాతం వరకు పెంచింది. 
2019 డిసెంబర్‌‌లో 20%, ఆ తర్వాత 2021 మేలో కరోనా టైంలో మరో 22% (కరోనా సెస్) దాకా పెంచింది. కరోనా టైంలో అన్ని రాష్ట్రాల్లో పెంచిన కరోనా సెస్​ను ఆ తర్వాత తీసేసినా మన రాష్ట్రంలో మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని కరోనా సెస్​ అని చూపకుండా ఇతర ట్యాక్స్‌‌ల్లో కలిపేశారు. 
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ రేటు
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యంపై మన రాష్ట్రంలో ఎక్కువగా వసూలు చేస్తున్నారు. చీప్​ లిక్కర్​ ధర కర్నాటకకు మనకు నలభై, యాభై రూపాయల తేడా ఉంది. ఒరిజినల్‌‌ చాయిస్‌‌ అనే చీప్​ లిక్కర్​ కర్నాటకలో రూ. 65 ఉంటే.. మన దగ్గర  రూ. 125కి అమ్ముతున్నారు.  లిక్కర్‌‌పై ట్యాక్స్‌‌లు, లైసెన్స్‌‌ ఫీజులు, అప్లికేషన్‌‌ ఫీజులు, డిస్టిల్లరీస్‌‌  లైసెన్స్‌‌ ఫీజులు కూడా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి.  తెలంగాణ వచ్చాక లైసెన్స్‌‌, అప్లికేషన్‌‌ ఫీజు డబుల్‌‌, ట్రిపుల్‌‌ చేశారు. 
అర్ధరాత్రి దాకా అమ్మకాలు
ఖజానాకు మద్యంతో మస్తు ఆమ్దానీ వస్తున్నా.. ఇంకా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్లు పెడుతున్నది. లిక్కర్​ సేల్స్‌‌ పెంచాలని కిందిస్థాయి అధికారులపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వైన్​ షాపులను అర్ధరాత్రి వరకు అనుమతిచ్చారు. గతంలో వైన్స్‌‌ ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసేవాళ్లు. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో అర్ధరాత్రి 11 గంటల వరకు ఓపెన్​ చేసి ఉంచుతున్నారు. బార్ల క్లోజింగ్‌‌ టైం అర్ధరాత్రి 12 వరకు ఉంది. హైదరాబాద్‌‌లో మాత్రం శుక్ర, శని, ఆదివారాల్లో అర్ధరాత్రి 1 వరకు పొడిగించారు. 
రెండేండ్లలో రూ. 38 వేల కోట్లకు పైన ఆమ్దానీ
రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఎక్సైజ్‌‌ పాలసీ మారుతుంది. 2019 నవంబర్‌‌ నుంచి 2021 అక్టోబర్‌‌ వరకు ఉన్న పాలసీని  కరోనా, ఇతర కారణాలతో నవంబర్‌‌ ఆఖరి వరకు పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216  వైన్​ షాపులు నడుస్తున్నాయి. ఈ రెండేండ్లలో రూ. 54,583 కోట్ల విలువైన లిక్కర్‌‌ సేల్‌‌ అయింది. ఇందులో తయారు చేసేటోళ్లు, అమ్మేటోళ్ల కంటే రాష్ట్ర సర్కారుకే మస్తు ఆమ్దానీ వచ్చింది. రెండేండ్లలో లిక్కర్​పై ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఇంచుమించుగా రూ. 38,200 కోట్ల రెవెన్యూ సమకూరింది. ఇది కాకుండా వైన్​ షాపుల లైసెన్స్‌‌ ఫీజు, అప్లికేషన్ల ఫీజుతో మరో రూ. 3 వేల కోట్ల దాకా వచ్చింది.