దళిత బంధును ఆపాలని ఈటల కోరలేదు

దళిత బంధును ఆపాలని ఈటల కోరలేదు
  • ఆ ఆర్టీఐ లెటర్ ఫేక్
  • దాన్ని సృష్టించిన వాళ్లపై ఎఫ్​ఐఆర్​ బుక్​ చేయండి-  సీఈవో శశాంక్​ 
  • గోయల్​కు ఎలక్షన్​ కమిషన్​ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: దళిత బంధును ఆపాలని ఈటల రాజేందర్​ కోరలేదని ఎలక్షన్​ కమిషన్​ స్పష్టం చేసింది. ఆర్టీఐ కింద ఈసీ సమాచారం ఇచ్చినట్లు చక్కర్లు కొడుతున్న లెటర్​ ఫేక్​ అని తేల్చిచెప్పింది. ఫేక్​ లెటర్​ క్రియేట్​ చేసినవాళ్లపై ఎఫ్​ఐఆర్​ బుక్​ చేసి చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్​ గోయల్​ను ఈసీ ఆదేశించింది. హుజూరాబాద్​లో దళిత బంధు ఆపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

సీఈవో లెటర్​ ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దళిత బంధు ఆపాలని మీరంటే, మీరే ఈసీకి లెటర్​ రాశారని పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈసీ నుంచి ఆర్టీఐ ద్వారా మోహన్​ మాగనేటి సమాచారం కోరినట్లు, దానికి ఈసీఐ అండర్​ సెక్రటరీ గుర్​ప్రీత్​ సింగ్​ ఈ నెల 22న సమాధానం ఇచ్చినట్లు, అందులో ఈటల రాజేందర్​ పేరు ఉన్నట్లు ఒక ఫేక్​ లెటర్​ను మంగళవారం సోషల్​ మీడియాలో ఫార్వర్డ్​ చేశారు. ఈ ఫేక్​ లెటర్​పై బుధవారం స్పందించిన ఈసీ.. అసలు గుర్​ప్రీత్​సింగ్​ పేరుతో తమ ఆర్టీఐ సెక్షన్​లో ఎవరూ పని చేయడం లేదని తేల్చిచెప్పింది. ఎలాంటి లెటర్​ తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీఐ అండర్​ సెక్రటరీ సంజయ్​ కుమార్​ బుధవారం సీఈవో శశాంక్​ గోయల్​కు లెటర్​ రాశారు. ఫేక్​ లెటర్​ సృష్టించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశించారు.