
కుభీర్, వెలుగు: గుట్కా ప్యాకెట్ ఇవ్వలేదని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పాల్సి గ్రామంలో ఓ యువకుడు స్నేహితున్ని హత్య చేశాడు. గ్రామానికి చెందిన లాలాజీ రమేశ్, పురంశెట్టి యోగేశ్(21) ఫ్రెండ్స్. శుక్రవారం ఉదయం ఇద్దరూ కలిసి కల్లు కాంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత యోగేశ్‌ని గుట్కా ప్యాకెట్ ఇవ్వమని రమేశ్ అడిగాడు. గుట్కా ఇవ్వలేదన్న కోపంతో నిన్ను చంపేస్తానంటూ యోగేశ్ చాతిపై రమేశ్ పిడి గుద్దులు గుద్దాడు.
దీంతో యోగేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు, అక్కడి నుంచి భైంసా గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే యోగేశ్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.