పన్నులతో రాష్ట్రానికి మస్త్ ఆమ్దానీ

పన్నులతో రాష్ట్రానికి మస్త్ ఆమ్దానీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పన్నురాబడి రూ.33,061 కోట్లు వసూలైనట్లు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ తెలిపింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి జీఎస్టీ, స్టేట్ ఎక్సైజ్ ఆదాయం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్, వెహికల్ ఇతర పన్నులు కలిపి ఈ మొత్తం వచ్చినట్లు సర్కార్​కు ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్, లాక్​డౌన్​తో మే, జూన్ నెలల్లో రాబడిపై కొంత ఎఫెక్ట్​ పడినప్పటికీ తరువాత పుంజుకుంది. ఎక్సైజ్ ఆదాయంతో పాటు భూముల విలువ పెంచడంతో, రిజిస్ట్రేషన్​ చార్జీలు పెరగడంతో స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ రాబడి పెరిగింది. అధిక ఆదాయం వచ్చే వాటిల్లో రూ.11 వేల కోట్లతో జీఎస్టీ ఫస్ట్ ప్లేస్​లో ఉండగా, ఆ తరువాత రూ.10,617 కోట్లతో సేల్స్ టాక్స్, రూ.1,573 కోట్లతో వెహికల్ టాక్స్ ఉన్నాయి. 

జీఎస్టీ పెరుగుతోంది

రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికి జీఎస్టీ కింద రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నెలలో రూ.2,697 కోట్లు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్​తో  మే, జూన్​ నెలల్లో కొంత తగ్గింది. మళ్లీ జులై నుంచి వసూళ్లు పెరిగాయి. మే నెలలో రూ.1,628 కోట్లు, జూన్​లో రూ.1,788 కోట్లు వచ్చాయి. ఇక జులైలో రూ.2,189 కోట్లు, ఆగస్టులో రూ.2,619 కోట్లు జీఎస్టీ వచ్చింది.

ఎక్సైజ్ రాబడి రూ.6,046 కోట్లు

ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల రెండింటి రాబడి 5 నెలల్లో రూ.9,747 కోట్లు వచ్చింది. ఇందులో ఎక్సైజ్ ఆదాయం రూ.6,046 కోట్లు కాగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లతో రూ.3,701 కోట్లు వచ్చింది. అయితే ప్రభుత్వం అంచనా వేసినంత ఆదాయం రావడం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లతో ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు వస్తాయని అంచనా వేయగా, అంతకు మించి వస్తోంది. భూమి విలువ సవరిస్తామని సర్కార్ సంకేతాలివ్వడంతో ఈ ఆదాయం వచ్చిందని ఆఫీసర్లు అంటున్నరు. అంతకుముందు ఏప్రిల్​లో రూ.628 కోట్లు, మేలో రూ.230 కోట్లు, జూన్​లో రూ.704 కోట్లు, ఆగస్టులో రూ.928 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్​ రాబడి ప్రతి నెలా యావరేజ్​గా రూ.1,400 కోట్లు అంచనా వేస్తే దాదాపు రూ.1,300 కోట్ల వరకు వస్తోంది.