లోన్లు తీస్కునుడు తప్ప ఆదుకోని రాష్ట్ర సర్కారు

లోన్లు తీస్కునుడు తప్ప ఆదుకోని రాష్ట్ర సర్కారు
  • ఒక్కో కార్పొరేషన్ కు వేల కోట్ల రూపాయల అప్పులు
  • మిత్తీలు కట్టేందుకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు అష్ట కష్టాలు
  • సంస్థల ద్వారా లబ్ధిదారులకు అందని సబ్సిడీలు
  • బకాయిలు పేరుకుపోయి కొత్త లోన్లకు బ్యాంకుల నో..
  • లాభాల్లో ఉన్న ఐదారు కార్పొరేషన్లకే ప్రభుత్వ గ్రాంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇష్టమున్నట్లు రాష్ట్ర సర్కారు వాటి ద్వారా అప్పులు చేసుడే తప్ప.. వాటిని ఆదుకునుడే లేదు. దీంతో కొన్ని కార్పొరేషన్లయితే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. తీసుకున్న అప్పులకు మిత్తీలు చెల్లించేందుకు నానా తిప్పలు పడుతున్నాయి. పంట కొనుగోళ్ల సంస్థల దగ్గరి నుంచి వివిధ స్కీమ్స్ అమలు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఫెడరేషన్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది.  ఏడేండ్లలో రూ. లక్ష కోట్లకుపైగా అప్పును కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారానే రాష్ట్ర సర్కారు తీసుకున్నది. ఆ నిధులను ఇరిగేషన్​ ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు వాడుకుంది. ఇక బడ్జెట్​లో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కోసం పెట్టుకున్న అరకొర నిధులను కూడా ప్రభుత్వం సరిగ్గా విడుదల చేయడం లేదు. ఫలితంగా కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడీలు కూడా నిలిచిపోతున్నాయి. రాజకీయ లబ్ధిలో భాగంగా టీఆర్​ఎస్​ సర్కార్​ ప్రతి రెండు, మూడేండ్లకోసారి కార్పొరేషన్లకు చైర్​పర్సన్లను నియమించుడే తప్ప.. వాటితో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కొత్త లోన్లకు ‘నో’ అంటున్న బ్యాంకులు
కొన్ని కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా, కొత్తగా లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయి. ఆయా కార్పొరేషన్లు పరిమితికి మించి లోన్లు తీసుకుంటున్నాయని నిరాకరిస్తున్నాయి. ఇటీవల కొన్ని కార్పొరేషన్లకు అప్పు ఇవ్వబోమని ఎస్బీఐ తేల్చి చెప్పింది. ఆయా కార్పొరేషన్ల పరిస్థితులను తెలియజేస్తూ, వాటికి లోన్లు ఇచ్చే విషయమై ఆలోచించాలని మిగిలిన బ్యాంకులకు కూడా సూచించింది. వీటిలో మార్క్​ఫెడ్, సివిల్​ సప్లయీస్​, హౌసింగ్ సహా కొన్ని కమ్యూనిటీ డెవలప్​మెంట్ కార్పొరేషన్లు ఉన్నాయి. పోయిన యాసంగిలో సివిల్ సప్లయీస్​ కార్పొరేషన్ కు అప్పు పుట్టకపోవడంతో దాదాపు నెలకు పైగా రైతులకు వడ్ల పైసల చెల్లింపులు ఆగిపోయాయి.

బీసీలకు లోన్లు ఇచ్చేందుకు రూ. 1,400 కోట్లతో బీసీ కార్పొరేషన్ డీపీఆర్ సిద్ధం చేసి, ప్రభుత్వ గ్యారంటీ కావాలని కోరింది. అయితే ఇప్పటికే ఇచ్చిన గ్యారంటీలు ఎక్కువైపోగా, బ్యాంకులు కొత్త లోన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో సర్కార్ ఆ ఫైల్​ను పక్కన పెట్టింది. ఇంకో ఐదారు కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. అయితే.. అప్పు పుట్టకపోవడంతో సర్కార్ కొత్త రూట్​ ఎంచుకుంది. ఏ బ్యాంకుల్లో లోన్లు తీసుకోలేదో, ఆ బ్యాంకుల్లో గ్యారంటీ చూపెడుతూ అప్పులు తీసుకునేలా ప్లాన్ చేసింది.
మిషన్‌‌ భగీరథ అప్పు... రూ. 19,080 కోట్లు
అప్పులు తీసుకునేందుకే రాష్ట్ర సర్కార్ కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటివి ఉన్నాయి.  మిషన్ భగీరథ కోసం తీసుకున్న అప్పు రూ. 19,080 కోట్లు. ఇరిగేషన్ ఇన్​ఫ్రాకు ప్రభుత్వ గ్యారంటీతో రూ. 3 వేల కోట్లు తీసుకున్నారు. భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్ల కోసం జెన్ కో కార్పొరేషన్ రూ. 30 వేల కోట్ల అప్పు తీసుకుంది. 
లాభాల్లో ఉన్న వాటికే గ్రాంట్లు
రాష్ట్రంలో మొత్తం 90కి పైగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నాయి. వీటిలో 6 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఆదాయం తెచ్చిపెడుతున్న సంస్థలపైనే ప్రభుత్వం ఫోకస్​ పెడుతున్నది.  బేవరేజెస్​ కార్పొరేషన్, టూరిజం, మినరల్ డెవలప్ మెంట్, సింగరేణి, విజయ డెయిరీ వంటి కార్పొరేషన్లకే వివిధ రకాలుగా సబ్సిడీ గ్రాంట్లు ఇస్తున్నది. స్కీమ్స్ అమలు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఇతర సర్వీస్ ఓరియెంటెడ్ వాటిని పట్టించుకుంటలేదు. సర్కార్ నిధులు రాక, కొత్త అప్పులు పుట్టక నష్టాల్లో ఉన్న కార్పొరేషన్లు ఇంకిన్ని తిప్పలు పడుతున్నాయి. ఎంతో కొంత ఆదాయం వచ్చే కార్పొరేషన్లనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కొన్ని కార్పొరేషన్లు యాక్షన్ ప్లాన్ పంపినా ఆమోదించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

మిత్తీలకే కోట్లకు కోట్లు
రాష్ట్ర సర్కార్ సివిల్ సప్లయీస్​ కార్పొరేషన్​తో వడ్లు కొంటుండగా, మార్క్ ఫెడ్ కార్పొరేషన్​తో వివిధ పంటలను కొనుగోలు చేస్తున్నది. గడిచిన ఏడేండ్లలో మార్క్​ఫెడ్  అప్పు రూ. 3,600 కోట్లకు చేరింది. ప్రతినెలా వడ్డీలకే రూ. 30 కోట్ల మేర చెల్లిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం ఏడేండ్లుగా బడ్జెట్ లో ఒక్క పైసా కేటాయించకపోవడంతో మార్క్ ఫెడ్  ఏటా కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంది. సివిల్ సప్లయీస్​ పరిస్థితి ఇదే రకంగా తయారైంది. వడ్ల కొనుగోళ్ల కోసం ఈ కార్పొరేషన్​ ఇప్పటికి రూ. 3,570 కోట్లు అప్పు తీసుకుంది. ఇక షీప్ ఫెడరేషన్ రూ. 2,500 కోట్ల అప్పు తీసుకుంది. వీటిని చెల్లించేందుకు ఆ సంస్థకు పెద్దగా ఆదాయమేమీ లేదు. దీంతో ప్రతినెలా వాయిదా చెల్లింపులకే సర్కార్​ను అడగాల్సి వస్తున్నదని ఆఫీసర్లు అంటున్నారు. ఆర్టీసీకి కూడా ఇప్పటికే రూ. 3 వేల కోట్ల అప్పు ఉంది. కార్మికుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులు కూడా మేనేజ్ మెంటే వాడుకుంది. వీటిని తిరిగి చెల్లించేందుకు లోన్ తీసుకుంది. డిస్కంలకు దాదాపు రూ. 10 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటికి సర్కార్ నుంచి రావాల్సిన సబ్సిడీలు టైంకు రావడం లేదు.