స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

నార్కట్​పల్లి, వెలుగు:  నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలోని ఏపీ లింగోటం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.  గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..  నార్కట్‌‌‌‌పల్లి పట్టణంలోని విద్యాపీఠ్ స్కూల్ బస్సు సోమవారం ఉదయం ఏపీ లింగోటం గ్రామంలో విద్యార్థినులను ఎక్కించుకొని గ్రామ శివారులో స్కూల్ బస్సు యూటర్న్ తీసుకుంటుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌‌‌‌కు ఉల్లిపాయల లోడ్ తో వెళ్తున్న లారీ వెనక నుంచి స్కూల్ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 

 లారీ అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో అటుగా వెళుతున్న వాహనదారులు ఉల్లిపాయల బస్తాల కోసం ఎగబడ్డారు. దొరికిన కాడికి బస్తాలు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రమాద విషయం స్థానికులు పోలీసులకు తెలపడంతో అక్కడ చేరుకున్న పోలీసులు బస్తాలను తీసుకెళ్తున్న వారిని నిలువరించారు.