టోక్యోలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదు

టోక్యోలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదు

టోక్యో: ఒలింపిక్స్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టోక్యో నగర పరిసరాల్లో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.40కు జపాన్ కాలమానం ప్రకారం రాత్రి 10.40 గంటలకు  గురువారం రాత్రి టోక్యో నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం సంభవించిన వెంటనే ముందు జాగ్రత్తగా బుల్లెట్ ట్రైన్ సర్వీసులను నిలిపివేశారు. 
భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది. టోక్యోకు తూర్పున 50 మైళ్ల లోతులో చిబా ప్రిఫెక్చర్ భూకంప కేంద్రం ఉందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. జపనీస్ స్కేలులో ప్రకంపనలు సున్నా నుండి 7 వరకు ఉంటుందని.. ఈ భూంకంపం వల్ల ఆస్తి నష్టమే తప్ప ప్రాణ నష్టం జరిగే అవకాశాల్లేవని సంస్థ వివరించింది. అలాగే సునామి హెచ్చరికలు జారీ చేయలేదని జపాన్‌ మెట్రోలాజికల్‌ ఏజెన్సీ వివరించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.