గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు
  • హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఘటన

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ కొండపై కొన్నేండ్లుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆలయ మండపంలోనే 10 అడుగుల లోతు గుంత తవ్వడం కలకలం రేపింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రత్యేక చొరవతో కొండపై వరకు రోడ్డు వేశారు. ఆలయ అభివృద్ధి కోసం వివిధ పనులు జరుగుతున్నాయి. 

ఈక్రమంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నక్షత్ర దీక్ష ముగిసిన సందర్భంగా కొండపైకి భక్తులు వెళ్లి స్వయంభూ శివాలయం, వీరభద్ర ఆలయాన్ని దర్శించుకున్నారు. మండపంలో 10 అడుగుల లోతు గుంత తవ్వి ఉండడం, పక్కనే పలుగు, పార, దోమలు కుట్టకుండా వాడిన కాయిల్​ డబ్బాలు, మిగిలిపోయిన ఆహారం, కవర్లు కనిపించాయి. 

కొత్తకొండలో ఎన్నో ఏండ్లుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. కొండపై ఏడు కోనేరులు, స్వయంభూ శివాలయం, పాత కట్టడాలు ఉండడంతో తవ్వకాలు జరిగేవి. అయితే ఆలయ మండపంలో ఇలా తవ్వకాలు జరగడం మొదటిసారిగా చెబుతున్నారు. ఇకనైనా తవ్వకాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకొని ఆలయాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.