ఆలేరు టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు

ఆలేరు టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరాయి. విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు భగ్గుమంటున్నారు. గతంలో వాసాలమర్రిలో సభలో ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద 25 లక్షల రూపాయలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు ఎమ్మెల్యే గొంగడి సునీత. అయితే పనులను సర్పంచ్ కు కాకుండా పార్టీ కార్యకర్తలు, నాయకులకు అప్పజెప్పడంతో అసమ్మతి మొదలైంది.

తాజాగా కొలనుపాక లో ఓ శిలాఫలకంలో ఉప సర్పంచ్ పేరు పెట్టి వార్డు సభ్యుల పేరు పెట్టలేదు. దీంతో వార్డు సభ్యులు ఎమ్మెల్యేను నిలదీశారు. పేరు పెట్టనందుకు శిలాఫలకం పగలగొడదామా అంటూ ఆమె జవాబు ఇచ్చారు. ప్రజలు ఓటు వేస్తేనే తాము గెలిచామంటూ వార్డ్ సభ్యులు చెప్పడంతో ఎమ్మెల్యే శిలాఫలకం ప్రారంభించకుండా, ఆగ్రహంతో చేతిలో ఉన్న కొబ్బరికాయను  నేలపై  పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీంతో వార్డు సభ్యులు అవాక్కయ్యారు. ప్రోటోకాల్ పాటించమని అడగడమే తప్పా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు.