కేంద్ర బడ్జెట్ పేదల్లో విశ్వాసం నింపలే

కేంద్ర బడ్జెట్ పేదల్లో విశ్వాసం నింపలే
  • కేంద్ర బడ్జెట్ పేదల్లో విశ్వాసం నింపలే
  • రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి 
  • అన్ని రంగాలకు కేటాయింపులు తగ్గిస్తోందని ఫైర్ 
  • ఉపాధి హామీకి వ్యవసాయాన్ని లింక్ చేయాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజ‌‌ల‌‌ను కేంద్ర బ‌‌డ్జెట్ నిరాశ‌‌ప‌‌రిచింద‌‌ని, పేదల్లో విశ్వాసం నింపలేదని టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. 90 నిమిషాల పాటు సాగిన ఆర్థిక మంత్రి బడ్జెట్ స్పీచ్.. 90 కోట్ల మందిని వెలివేసినట్టుగా ఉందని విమర్శించారు. బుధవారం రాజ్యస‌‌భ‌‌లో బడ్జెట్ పై చ‌‌ర్చ సందర్భంగా సురేశ్ రెడ్డి మాట్లాడారు. కేంద్రం అన్ని రంగాలకు బ‌‌డ్జెట్​లో కేటాయింపులు త‌‌గ్గిస్తోందని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో లింక్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంతకుముందే కేంద్రానికి సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. రైతులు ఏ పంట పండించినా మద్దతు ధర ఇస్తామనే హామీ ఇవ్వాల‌‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 
వడ్లపై ఎందుకు స్పందించలే? 
యాసంగిలో వడ్లు కొనాలని సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చినా కేంద్రం ఎందుకు స్పందించలేదని సురేశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం దాదాపు నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉన్నా, ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. రైతులు పండించిన పంటను కొనడానికి మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. డిజిటల్ ఇండియా ఆవిష్కరిస్తామంటూ చెప్తున్న కేంద్రం.. డిజిటలైజేషన్‌‌ను కేవలం కాగితాలపైనే చూపుతోందన్నారు. హైదరాబాద్‌‌కు ఐటీఐఆర్‌‌ ప్రాజెక్టు శాంక్షన్ అయితే, దాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు ప్రారంభమైతే ఇండియాకే ఐకాన్‌‌గా నిలిచేదన్నారు.  
దురుద్దేశంతోనే ప్రధాని కామెంట్స్.. 
ప్రధాని మోడీ దురుద్దేశంతోనే తెలంగాణపై కామెంట్లు చేశారని సురేశ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ లో పాసైన బిల్లుపై మోడీ ప్రశ్నలు లేవనెత్తడం సరికాదన్నారు. హౌస్ లో పాసైన బిల్లుపై ప్రశ్నించే అధికారం ప్రధానికి కూడా లేద‌‌న్నారు. ‘‘విభజన వ‌‌ల్ల మీకేమైనా ఇబ్బందులు వ‌‌చ్చాయా’’ అని ప్రధానిని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ సమస్యలపై కేంద్రం కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని మండిపడ్డారు.