మీరు మారిపోయారండీ.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల త‌ర‌హాలో ఆర్టీసీ టికెట్ రేట్లు..

మీరు మారిపోయారండీ.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల త‌ర‌హాలో ఆర్టీసీ టికెట్ రేట్లు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. అదే గనక నిజమైతే.. తెలుగు రాష్ట్రాలకు ప్రయాణించే వారు ఇప్పుడు ప్రస్తుతమున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది.

డైనమిక్ టికెటింగ్ సిస్టమ్ అంటే టిక్కెట్లు బుక్ అయిన వెంటనే బస్సుల్లో సీట్ల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. సాధారణంగా, ఈ మార్గంలో టికెట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ డిమాండ్‌ మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్త్‌లకు ఎక్కువ టిక్కెట్‌ చార్జీలు వసూలు చేస్తారు. సీటింగ్ మాత్రమే ఉన్న సర్వీసుల్లో డ్రైవర్ వెనుక మొదటి వరుస సీట్లు, చివరి రెండు వరుసల బస్సులు మినహా టికెట్ చార్జీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతికి బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ క్రమంగా పెంచింది. ఈ క్రమంలోనే ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సేవలను తగ్గించింది. అది ఒక విధంగా TSRTCకి సహాయపడింది. ప్రస్తుతం హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే సూపర్ లగ్జరీ బస్సుకు రూ.1వెయ్యి60, రాజధాని ఏసీ సెమీ స్లీపర్ బస్సుకు రూ.13వందల40, లహరి ఏసీ స్లీపర్ బస్సుకు రూ.2వేల150, గరుడ ప్లస్ బస్సుకు రూ.15వందల80 వసూలు చేస్తున్నారు.

ఈ విధానం అమల్లోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుత టిక్కెట్ ధరలపై 25 శాతం అదనంగా వసూలు కానుంది. అయితే ప్రైవేట్ ఆపరేటర్లు నిర్ణయించే టిక్కెట్ ధరలను అంచనా వేసి ఆర్టీసీ బస్సుల టిక్కెట్ ధరలను నిర్ణయిస్తారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నడిచే బస్సులలో RTC డైనమిక్ టికెటింగ్ ను గతంలో అమలు చేశారు. ఇప్పుడు దాని వల్ల ఆదాయం సగటున కనీసం 15 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పుడు తిరుపతి మార్గంలోనూ ఇదే విధానాన్ని అమలు చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.