
- ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్న సదరన్ డిస్కం
- విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్స్ ను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్నది. ఈ కేబుల్స్‌ను తొలగించాలని సంబంధిత ఇంటర్ నెట్, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, హెచ్చరికలు జారీ చేసినా ఫలితం రాలేదు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రమాదకరంగా మారిన కేబుల్స్ తొలగించేందుకు సదరన్ డిస్కం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. విద్యుత్ స్తంభాలపై 15 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో వేలాడుతున్న కేబుల్స్.. విద్యుత్ షాక్, అగ్నిప్రమాదాలు ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ కేబుల్స్ బారినపడి పలువురు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఎక్కే విద్యుత్ సిబ్బందికి ఇవి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు కేబుల్ ఆపరేటర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. వాటిని తొలగించకుండా కేబుల్ ఆపరేట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యుత్ శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఇబ్బందిగా మారిన, ప్రమాదకరంగా ఉన్న కేబుల్స్‌ను తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియలో స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకుంటున్నామని డిస్కం అధికారులు తెలిపారు.