హైదరాబాద్ లో ఇవాళ ఒకే రోజు రెండు విషాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఉదయం ఓల్డ్ బోయిన్ పల్లి భవానినగర్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇద్దరు కూతుర్లకు నిద్ర మాత్రలు ఇచ్చి, ఆ తర్వాత తాను కూడా నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలో తండ్రి శ్రీకాంత్ చారి (42), కూతుళ్లు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు డెడ్ బాడీలను సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.
అయితే ఈ ఘటన తాలుక విషాదాన్ని మరువక ముందే కాసేపటి క్రితమే బోరబండ పరిధిలో రాజ్ నగర్ లో అలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అర్జున్ (4), ఆదిత్య(2) కు తల్లి జ్యోతి(31) విషమిచ్చి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ లోని ఓ పాఠశాలలో జ్యోతి టీచర్ గా పనిచేస్తోంది. భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటనేదానిపై ఆరాదీస్తున్నారు.
ALSO READ: పరకాల ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. గ్రామాల్లో ధర్మారెడ్డికి నిరసనల వెల్లువ
ఒకే రోజు రెండు మధ్య తరగతి కుటుంబాలు ప్రాణాలు తీసుకోవడం నగరంలో కలకలం రేపుతోంది. రెండు ఘటనల్లో ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారులు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
