కీలక పోస్టులను వారికి కేటాయించడం ఇదే మొదటిసారి

కీలక పోస్టులను వారికి కేటాయించడం ఇదే మొదటిసారి

లండన్: బ్రిటన్ కేబినెట్​లో మనోళ్లు ఇద్దరికి అవకాశం దక్కింది. భారతి సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్ మాన్, అలోక్ శర్మకు మంత్రి పదవులు దక్కాయి. సుయెల్లాకు కీలకమైన హోంశాఖ దక్కగా.. బుధవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రీతి పటేల్ తర్వాత ఈ పదవి చేపట్టిన రెండో ఇండియన్ ఆరిజన్ ఈమెనే. సుయెల్లా తల్లిది తమిళనాడు, తండ్రిది గోవా. ఆమె తల్లి మారిషస్ నుంచి, తండ్రి కెన్యా నుంచి బ్రిటన్ కు వలస వచ్చారు. 2018లో రేల్ బ్రేవర్ మాన్ ను పెండ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫారెహమ్ ఎంపీ అయిన సుయెల్లా.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అటార్నీ జనరల్ గా పని చేశారు. ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో రిషి శునక్, లిజ్ ట్రస్ తో పాటు ఈమె కూడా పోటీ పడ్డారు. మొదటి రౌండ్ లోనే ఓడిపోయిన ఆమె.. ఆ తర్వాత లిజ్ ట్రస్ కు మద్దతుగా నిలిచారు. కాగా, అలోక్ శర్మకు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్(కాప్ 26) ప్రెసిడెంట్ పదవి దక్కింది. ఆగ్రాకు చెందిన ఈయన.. జాన్సన్ ప్రభుత్వంలో ఇదే పదవిలో ఉన్నారు.  

కీలక పోస్టుల్లో మైనార్టీలు.. 

ప్రధాని ట్రస్ బుధవారం తొలి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆమె తన కేబినెట్​లో కీలకమైన 4 శాఖలను మైనార్టీ వర్గాలకు కేటాయించారు. ఇలా కీలక పోస్టులను నల్లజాతీయులకు కేటాయించడం ఇదే మొదటిసారి.