అనుమానాస్పద స్థితిలో డ్యాంలో పడిపోయిన విద్యార్థులు

అనుమానాస్పద స్థితిలో డ్యాంలో పడిపోయిన విద్యార్థులు
  • ఇద్దరూ ఎస్సెస్సీ స్టూడెంట్లే..   ఒకరు మృతి.. మరొకరికి సీరియస్​​
  • ఆదిలాబాద్ ​జిల్లా జైనథ్​ మండలం  లక్ష్మీపూర్​ డ్యాం వద్ద ఘటన  

ఆదిలాబాద్​టౌన్​(జైనథ్​), వెలుగు: ఆదిలాబాద్​జిల్లా జైనథ్​ మండలంలోని లక్ష్మీపూర్ ​డ్యాంలో ఇద్దరు ఎస్సెస్సీ విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో పడిపోయారు. ఇందులో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పశువుల కాపర్లు, స్థానికులు,  పోలీసుల కథనం ప్రకారం.. జైనథ్ ​మండల కేంద్రానికి చెందిన పారిక్​ ప్రీతి, పాటిల్ ​ప్రియాంక స్నేహితులు. వీరు స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. జైనథ్​కు కిలోమీటర్​ దూరంలోని స్కూల్​కు రోజూ నడుచుకుంటూ వెళ్తారు. స్కూల్​నుంచి డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. బుధవారం వీరిద్దరు స్కూల్​కు వెళ్లలేదు.

మధ్యాహ్నం వేళలో లక్ష్మీపూర్ ​డ్యాం వద్ద గొర్రెల కాపరులకు కనిపించారు. డ్యాం పక్కనే పశువులు కాస్తున్న ఓ వ్యక్తి  ప్రీతి, ప్రియాంకలు డ్యాంలో పడిపోవడాన్ని గమనించాడు. వెంటనే అతడు డ్యాంలోకి దిగి ప్రీతిని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే ప్రియాంక మునిగిపోవడంతో చనిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని రిమ్స్​కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇద్దరూ స్కూల్​కు వెళ్లకుండా డ్యాంకు ఎందుకు వెళ్లారు? అక్కడేం జరిగింది అనేది తెలియడం లేదు. డ్యాం దగ్గర ప్రీతికి చెందిన స్కూల్​ బ్యాగ్​ దొరికిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రీతి కోలుకుని ఏమైనా చెప్తేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులంటున్నారు.