రైతు ఉద్యమాన్ని విరమింపచేసేందుకు కేంద్ర మరో అడుగు

రైతు ఉద్యమాన్ని విరమింపచేసేందుకు కేంద్ర మరో అడుగు
  • ఆందోళన ఆపాలంటూ రైతు సంఘాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: రైతు ఉద్యమాన్ని విరమింపచేసేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. ఆందోళన ఆపాలంటూ రైతు సంఘాలకు లెటర్ రాసింది. ఆ లెటర్ పై రైతు నేతలు చర్చించారు. అయితే కేంద్రం పెట్టిన షరతులను ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. 
వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు, కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామీ కోరుతూ ఢిల్లీ బోర్డర్ల దగ్గర ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమం చివరిదశకు చేరినట్టు కనిపిస్తోంది. 
ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం... కనీస మద్దతు ధర (MSP)పై చట్ట బద్ధ హామీ కావాలన్న రైతుల డిమాండ్ పై కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు హోంశాఖ నుంచి లెటర్ వచ్చింది. MSP అంశంతో పాటు ఉద్యమంలో రైతులపై పెట్టిన పోలీస్ కేసులను తేల్చేందుకు ఓ కమిటీ వేస్తామని రైతులకు కేంద్రం తెలిపినట్టు సమాచారం. 
ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో రైతులను వేలాది కేసులు నమోదయ్యాయి. ఇందులో పంటల వ్యర్థాలు తగలబెట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఇక MSPపై వేయబోయే కమిటీలో రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారని సమాచారం.
అయితే రైతు సంఘాల నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో లేరు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఈ మధ్యే సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కేంద్రం లెటర్ పై చర్చించింది. ఉద్యమం ఆపితేనే కేసులు విత్ డ్రా చేస్తామని కేంద్రం షరతు పెట్టిందని రైతు నేతలు చెబుతున్నారు. కేంద్రమే ముందుగా కేసులు విత్ డ్రా చేసుకోవాలంటున్నారు. ఉద్యమంలో చనిపోయిన 700 మందికి పైగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 
ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ అస్పష్టంగా ఉందని రైతు నేతలు చెబుతున్నారు. అయితే ఇవాళ్టి మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు మధ్యాహ్నం 2గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మీటింగ్ లోనే గవర్నమెంట్ లెటర్ పై నిర్ణయం తీసుకోనున్నారు.