స్కూల్స్ లో పిల్లలకు చంద్రయాన్ 3 లైవ్ చూపించండి : సీఎం ఆదేశాలు

స్కూల్స్ లో పిల్లలకు చంద్రయాన్ 3 లైవ్ చూపించండి : సీఎం ఆదేశాలు

చంద్రయాన్-3 మరో కొన్ని గంటల్లో చంద్రునిపై ల్యాండింగ్ కానున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్‌లో రన్ అవుతోన్న అన్ని స్కూళ్లల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వీక్షణ కోసం పాఠశాలలు సాయంత్రం ఒక గంట పాటు ప్రత్యేకంగా తెరిచి ఉంచాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సూచనలను ఉటంకిస్తూ,  “ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటలకు, చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, డిడి నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు, విద్యాసంస్థల్లో సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలి అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఆగస్టు 23న సాయంత్రం చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ దాని ప్రజ్ఞాన్ రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై మృదువైన ల్యాండింగ్‌ కానుంది. ‘‘ఇలాంటి చారిత్రాత్మక సందర్భంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సాయంత్రం వేళల్లో పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి’’ అని  అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ హుల్గి అన్నారు. చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ ఒక ముఖ్యమైన సందర్భమని, ఇది మన యువతలో ఉత్సుకతను పెంచడమే కాకుండా అన్వేషణ పట్ల మక్కువను రేకెత్తిస్తుందని చెప్పారు. పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా విద్యా, శిక్షణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.