కొవాగ్జిన్ కు అనుమతి ఇవ్వని అమెరికా

కొవాగ్జిన్ కు అనుమతి ఇవ్వని అమెరికా

అమెరికాలో కొవాగ్జిన్ ను విడుదల చేయాలన్న భారత్ బయోటెక్ ప్రయత్నాలకు పర్మిషన్ లభించలేదు. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (US FDA ) అనుమతిని నిరాకరించింది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా చెబుతూ అనుమతులను నిరాకరించింది.

కొవాగ్జిన్ తయారీకి అమెరికా భాగస్వామి అయిన ఆక్యుజెన్ ఫార్మా.. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసింది. అయితే.. ఇప్పుడు FDA  అప్రూవల్ ను తిరిస్కరించడంతో ఇక దానికి దరఖాస్తు చేయబోమని.. అన్నీ పూర్తయ్యాక బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ ను పెట్టుకుంటామని ప్రకటించింది. FDA నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పింది.

దీంతో కొవాగ్జిన్ అమెరికాలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ఆక్యుజెన్ సీఈవో డాక్టర్ శంకర్ ముసునూరి చెప్పారు.  అయితే కొవాగ్జిన్ కు ఇప్పటికే కెనడాలో మార్కెట్ చేసేందుకు ఎక్స్ క్లూజివ్ హక్కులు దక్కాయి. మార్కెటింగ్ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖతో సంస్థ చర్చలు జరుపుతోంది.