మరో 128 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్

మరో 128 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
  • ధరాలీలో ముమ్మరంగా సహాయక పనులు
  •  ఆపరేషన్​లో డ్రోన్లు, స్నిఫర్  డాగ్స్

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామంలో శుక్రవారం మరో 128 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. బురద, ఇండ్ల శకలాల్లో  చిక్కుకుపోయిన వారి ఆచూకీని కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్లను అధికారులు తీవ్రం చేశారు. ఇందుకోసం డ్రోన్లు, స్నిఫర్  డాగ్స్ ను కూడా రంగంలోకి దించారు. శకలాల కింద చిక్కుకున్న బాధితుల కోసం స్నిఫర్  డాగ్స్  అణువణువూ గాలిస్తూ రెస్క్యూ టీమ్స్ కు సహాయపడుతున్నాయి. మంగళవారం నుంచి ఇప్పటివరకూ 566 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ధరాలీ గ్రామాన్ని వరద బురద ముంచెత్తడంతో మొత్తం ఐదుగురు చనిపోయారని ఉత్తరాఖండ్  స్టేట్  డిజాస్టర్  మేనేజ్ మెంట్  అథారిటీ (యూఎస్ డీఎంఏ) అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికితీశామన్నారు. 

గల్లంతయిన 19 మంది (ఏడుగురు చిన్నారులు, 9 మంది జవాన్లు) ఆచూకీ ఇంకా తెలియరాలేదని, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు. కాగా.. వరద బురదలో మిస్సింగ్  అయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ధరాలీ గ్రామాన్ని బురద ముంచెత్తడంతో స్థానికులు, పర్యాటకులతో పాటు బిహార్, నేపాల్ కు చెందిన కార్మికులు కూడా గల్లంతయ్యారు. గ్రామంలోని కొండపై పలు కన్ స్ట్రక్షన్  సైట్ లలో ఆ కార్మికులు పనిచేస్తున్నారు. గంగోత్రికి వెళ్లే దారిలో ధరాలీ కీలక హాల్ట్  కావడంతో పలు హోటళ్లు, హోంస్టేలు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. దీంతో యాత్రికులు ఇక్కడ సేదదీరి గంగోత్రికి వెళతారు. 

భాగీరథి నదిపై బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ

వరద బురదలో చిక్కుకున్న బాధితులను కనుగొనేందుకు మొత్తం 800 మంది రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. ఆర్మీ, ఇండో టిబెటన్  బార్డర్  పోలీస్ (ఐటీబీపీ), నేషనల్  డిజాస్టర్  రెస్పాన్స్  ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్  డిజాస్టర్  రెస్పాన్స్  ఫోర్స్  (ఎస్డీఆర్ఎఫ్) తో పాటు పోలీసులు కూడా సహాయక పనుల్లో పాల్గొంటున్నారు.