యూట్యూబ్​లో మరో మైలురాయిని.. చేరుకున్న V6 వెలుగు చానల్

యూట్యూబ్​లో మరో మైలురాయిని.. చేరుకున్న V6 వెలుగు చానల్

 

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రం.. మన భాష.. మన బతుకు.. మన వార్తలతో జనం ఆదరణ పొందిన V6- వెలుగు చానల్​ మరో మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్​లో V6 -వెలుగు న్యూస్ చానల్ ప్లాట్ ఫామ్​ 90 లక్షల మంది సబ్​స్క్రైబర్ల మార్క్ ను అందుకుంది. మన తెలంగాణ జనం అంతులేని అభిమానంతో మరింత వేగంగా కోటి సబ్​స్క్రైబర్ల దిశగా సాగుతున్నది. ఈ మైలురాయికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఎట్లాంటి స్పెషల్​ క్యాంపెయిన్లు, పెయిడ్ ప్రమోషన్లు లేకుండా కేవలం వార్తలకే పరిమితమైన ఒక చానల్ ప్లాట్ ఫామ్ ఆర్గానిక్ గా 90 లక్షల మంది సబ్​స్క్రైబర్లను సొంతం చేసుకోవడం అత్యంత అరుదు. 


అందులోనూ రెండు రాష్ట్రాలుగా మారిన తెలుగు నేలలో తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడి ఈ ఘనత సాధించడం విశేషం. లేనిపోని సంచలనాలు, సినిమా గాసిప్పులు, కల్పిత కథనాలు వంటివి లేకుండా ఈ మైలురాయిని చేరుకోవడం కూడా ఇప్పటి మీడియా ట్రెండ్​లో  మామూలు విషయం కాదు. నాలుగుకోట్ల తెలంగాణ జనం మంచిచెడ్డలు, మాటముచ్చట్లు, వారి గొంతు వినిపించే వేదికగా ఉండడమే ఇంత అరుదైన గౌరవానికి కారణం. ఇది మా చానెల్ అని సగర్వంగా చెప్పుకునే తెలంగాణ జనం, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు బిడ్డల ఆదరణ అన్నీ కలిసి V6- వెలుగును ఇంతెత్తున నిలబెట్టాయి.

కోటికి మించిన రతనాల వీణ

V6 -వెలుగు మీడియాను వేర్వేరు సోషల్ మీడియా వేదికల్లో కోటీ 30 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారన్న ముచ్చట తెలిసిందే. అట్లాగే V6- వెలుగు వార్తల వెబ్ సైబ్ నెలకు కోటి మందికిపైగా విజిటర్స్ తో ముందుకు సాగుతున్నది. దీంతో పాటు డైలీహంట్ లాంటి ఒక్క వేదికపైనే V6- వెలుగు వార్తలకు నెలకు మరో కోటి మందికిపైగా విజిటర్స్ ఉన్నారు. పబ్లిక్ వాయిస్ గా నిలిస్తే ఎంతటి మైలురాయినైనా చేరుకోవడం సాధ్యమేననడానికి  V6- వెలుగుకు లభిస్తున్న ఆదరణే నిదర్శనం. ఇప్పుడు కాదు పదేండ్లుగా ఎప్పటికప్పుడు తెలంగాణ జనం దీన్ని నిరూపిస్తూనే వచ్చారు. జనానికి పనికొచ్చే వార్తలకు, జనం తిప్పలు చెప్పే కథనాలకు, మన భాషలో వచ్చే తీన్మార్ కు తిరుగులేని ఆదరణ అందించారు. బోనాల సందడి నుంచి గణేశ్ పండుగ దాకా, బతుకమ్మ వేడుక నుంచి మేడారం జాతర దాకా.. మన బతుకు పండుగలకు కేరాఫ్ గా V6- చానల్​, వెలుగు దినపత్రిక నిలిచాయి. అధికార పార్టీ అగ్రనేతల నుంచి పార్టీలకు అతీతంగా ముఖ్య నేతలందరూ మన V6- వెలుగు మీడియాలో తమ వార్తలు వస్తేనే అందరికీ చేరుతాయని బలంగా నమ్ముతారు. కరోనా కాలంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లను V6- వెలుగు వేదికపైనే లక్షల మంది లైవ్ లో చూడడం పెద్ద సంచలనం. అట్లాగే తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ సభల నుంచి నిన్నమొన్నటి రాహుల్ సభ వరకు నేరుగా వచ్చే జనానికి మించి V6- వెలుగు వేదికలపైనే ఎక్కువమంది లైవ్ లో చూస్తారన్నది వ్యూస్ చెప్పే వాస్తవం. ఇంతటి ఆదరణ, అరుదైన గౌరవాన్ని అందించిన తెలంగాణ పుడమితల్లి బిడ్డలకు పేరుపేరునా కోటి కోట్ల శనార్తులు.