త్వరలో 12–18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్

త్వరలో 12–18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ:  అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకా త్వరలో12 నుంచి 18 ఏండ్ల మధ్య పిల్లలకు అందుబాటులోకి రానుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై సుప్రీంకోర్టు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ కేంద్రం శుక్రవారం అఫిడవిట్ సమర్పించింది. దేశంలోని పెద్ద వాళ్లందరికీ (18 ప్లస్ వాళ్లకు) ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో 18 ఏండ్లు పైబడిన వాళ్లు 93–94 కోట్ల మంది ఉంటారని, వీళ్లందరికి కలిపి మొత్తం 186.6 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని చెప్పింది. అన్ని ఏజ్​ల​ వాళ్లకూ త్వరలో వ్యాక్సిన్లను అనుమతిస్తామని, ఎలాంటి తేడాలు ఉండవని తెలిపింది. తమ వ్యాక్సినేషన్ పాలసీ పరిస్థితికి అనుగుణంగా మారుతూ ఉంటుందని చెప్పింది. సోమవారం నుంచి 18 ఏండ్లు దాటినోళ్లందరికీ కరోనా టీకా ఫ్రీగా అందుతుందని కేంద్రం పేర్కొంది. వ్యాక్సినేషన్ లెక్కలను రోజూ పబ్లిక్ డొమైన్ లో పెడతామని, ఇందులో ట్రాన్స్ పరెన్సీ ఉంటుందని వివరించింది. పేదలకు ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేసుకునేందుకు వీలుగా వోచర్ల స్కీంను ప్రవేశపెడతామని, వీటిని ఎన్​జీవోలు కొనుగోలు చేసి, అవసరమైన వాళ్లకు టీకాలు ఇవ్వొచ్చని తెలిపింది.