
- కాదు.. లేదంటే జరిమానాలు బహిష్కరణలు
- ఎనిమిది నెలల్లో ఐదు గ్రామాల వీడీసీలపై కేసులు
మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో 10 గుంటల భూమిపై వీడీసీ, ముదిరాజ్ కులస్తుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో తమ ఆదేశాలు ఉల్లంఘించి భూమి కొనుగోలు చేశారని వీడీసీ బాధ్యులు ముదిరాజ్‌లను సాంఘిక బహిష్కరణ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో కల్లు అమ్ముకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలని వీడీసీ బాధ్యులు గౌడ కులస్తులకు హుకుం జారీచేశారు. పట్టించుకోకపోవడంతో మూడు గౌడ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
మెట్ పల్లి,వెలుగు: ప్రభుత్వాలు మారుతున్నా... టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. గ్రామాల్లో ఇంకా మార్పు రావడంలేదు. అభివృద్ధి పేరిట వీడీసీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. గ్రామాలను చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాయి. కాదు.. లేదంటే సాంఘిక బహిష్కరణలు.. జరిమానాల పేరిట వేధిస్తున్నాయి. అయినా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు.. ప్రజాప్రతినిధులు వినిపించుకోవడంలేదు. ఎలాంటి అధికారాలు.. గుర్తింపు లేని వీడీసీ(విలేజ్డెవలప్ మెంట్కమిటీ) బాధ్యులు జిల్లాలోని చాలాగ్రామాల్లో ఇష్టాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ విషయమైనా ముందు వీడీసీలో పంచాయితీ పెట్టాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే శిక్షలకు గురికావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో గతంలో వీడీసీలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. పెద్దమనుషుల్లో మార్పురావడంలేదు. మెట్ పల్లి సర్కిల్ పరిధిలో ఐదు గ్రామాల వీడీసీలపై సాంఘిక బహిష్కరణ చేశారని పోలీసులకు ఫిర్యాదు వెళ్లాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు 600 మందికి పైగా సభ్యులను బైండోవర్ చేశారు. తాజాగా మెట్ పల్లి ఏరియాలో వీడీసీ, కొన్ని కులసంఘాల మధ్య గొడవలు ముదిరాయి. కొండ్రికర్ల గ్రామంలో వీడీసీ, ముదిరాజ్ కులస్తుల మధ్య జరిగిన భూ వివాదం గొడవలో జిన్నా శంకర్ అనే వ్యక్తి తల్వార్ తో దాడి చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది.
ఆర్డర్ అమలు కాకుంటే...ఆంక్షలే
వీడీసీ బాధ్యులు ఇచ్చిన ఆర్డర్ అమలు కాకకుంటే శిక్షలు తప్పడంలేదు. మెట్ పల్లి మండలం మెట్లచిట్టపూర్ లో ఐకేపీ కొనుగోలు సెంటర్ లో ధాన్యం అమ్ముకునే రైతులు సంచికి రూపాయి చెల్లించాలని వీడీసీ ఆదేశాలు జారీచేసింది. దీనిని మున్నూరుకాపు, గుడాటి కాపులు వ్యతి రేకించారు. ఆగ్రహించిన వీడీసీ సభ్యులు రెండు కులాలకు చెందిన 70 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. ఐదు నెలల పాటు గ్రామంలోఎలాంటి సౌకర్యాలు అందకుండా చేశారు. ఆర్డీవో, డీఎస్పీ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఆంక్షలు ఎత్తివేయలేదు. దీంతో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.
నియంత్రణ కరువు
జిల్లాలో కొన్ని గ్రామాల్లో వీడీసీలు బహిరంగంగా ఇసుక అక్రమ రవాణా, బెల్టుషాపుల నిర్వహణకు వేలం నిర్వహించి లక్షలకు లక్షలు సమకూర్చుకుంటున్నాయి. ఈ డబ్బుల నుంచి ఆయా ఆఫీసర్లకు వాటాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు వీడీసీల ఆగడాలు తెలిసినా అడ్డుకోవడంలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వీడీసీలు నిషేధిత వ్యాపారాలకు వేలంపాటలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినా.. ఫిర్యాదులు రాలేదంటూ కొట్టిపారేస్తున్నట్లు పలువురురు పేర్కొంటున్నారు. కొంత మంది లీడర్ల మద్దతు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
హద్దు మీరితే చర్యలు
వీడీసీలకు ఎలాంటి గుర్తింపు లేదు. జరిమానాలు, సాంఘిక బహిష్కరణలు చేస్తే నేరం చేసినట్లు. చట్టవ్యతిరేక పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సర్కిల్ పరిధిలో సుమారు 600 మందిని బైండోవర్ చేశాం.
- లక్ష్మీనారాయణ, సీఐ