V6 News

అనిల్ రావిపూడి సినిమాలో షాకింగ్ కాంబినేషన్.. వెంకటేష్ పక్కన ఆ స్టార్ హీరోయిన్!

అనిల్ రావిపూడి సినిమాలో షాకింగ్ కాంబినేషన్.. వెంకటేష్ పక్కన ఆ స్టార్ హీరోయిన్!

వరుస హిట్ మూవీస్ తో దూసుకెళ్తున్నారు టాలీవుడ్  దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి రేసులో సక్సెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. గడిచిన రెండేళ్లలో 2025లో వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం', 2026లో మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి భారీ బ్లాక్‌బస్టర్లను అందించిన అనిల్, ఇప్పుడు తన ఫేవరెట్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ మల్టీస్టారర్‌ను ఆయన సిద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్రెష్ కాంబినేషన్స్..!

ఈ సినిమాలో నటీనటులు ఎంపిక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం విశేషం. ఇప్పటివరకు యువ హీరోలతో ఆడిపాడిన కీర్తి, సీనియర్ స్టార్ వెంకీతో జోడీ కట్టడం ఇదే తొలిసారి. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై సరికొత్త మేజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు.

అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్

హీరోయిన్ల నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టడంలో అనిల్ రావిపూడి దిట్ట. నయనతార వంటి టాప్ స్టార్‌ను ప్రమోషన్స్‌కు ఒప్పించడమే కాకుండా, ఇప్పుడు బిజీ షెడ్యూల్‌లో ఉన్న కీర్తి సురేష్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడంలో ఆయన సఫలమయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్థన' చేస్తున్న కీర్తి, ఆ సినిమా పూర్తి కాగానే జూన్ నుండి అనిల్ రావిపూడి సెట్స్‌లో అడుగుపెట్టనుందని సమాచారం. 

సంక్రాంతి సెంటిమెంట్..

వరుసగా మూడవ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో అనిల్ రావిపూడి ఉన్నారు. వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కలయికతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ కలగలిసిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని అనిల్ తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడికి ఈసారి వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.