
వేములవాడ, వెలుగు: వేదాలు, శాస్త్రాలను నేటి తరానికి అందిస్తున్న వేద పండితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని విప్ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేద పండితులకు నిర్వహించిన చతుర్వేద స్మార్త పరీక్షల్లో ఉతీర్ణత సాధించిన 157 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, హైందవ సంస్కృతిలోని వేదాలను ప్రపంచంలోనే ఇతర దేశాలు ఆచరిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో పరీక్ష రాసే వేద విద్యార్థుల సంఖ్య పెరగాలన్నారు. అంతకుముందు తొలి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఈవో రాధాబాయ్ పాల్గొన్నారు.
చందుర్తి, వెలుగు: చందుర్తి మండలకేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన అఖండ భజనలో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 ఏండ్లుగా అఖండ భజన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బాసెట్టి భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామస్వామి, సెస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్, లీడర్లు ప్రభాకర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.