హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దళాలు భారత నౌకలను టార్గెట్ చేస్తున్న వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఒక భారత నౌకా అధికారి ఇరాన్ నావికా దళంతో వాదిస్తున్నట్లుగా ఉంది.
"సెపా నేవీ.. ఇది సన్మార్ హెరాల్డ్ ట్యాంకర్. మీరు నాకు వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు. మీ లిస్టులో నా పేరు రెండో స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు మీరు నాపై కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి వెళ్లిపోనివ్వండి" అని ఆ అధికారి ఆవేదనగా అడగడం ఆ క్లిప్‌లో వినిపిస్తోంది. అయితే, ఈ ఆడియో నిజమైనదేనా అన్నది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.
శనివారం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరిగాయి. దీంతో ప్రమాదాన్ని గమనించిన మరో నాలుగు నౌకలు రూట్‌ను మార్చుకున్నాయి. ఒక చమురు ట్యాంకర్ మాత్రం ఎలాగోలా ఆ ప్రాంతాన్ని దాటగలిగింది. మొదట్లో సముద్ర మార్గం తెరిచే ఉందని చెప్పిన ఇరాన్, ఆ తర్వాత మాట మార్చి రూట్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ఓడరేవులపై ఆంక్షలు విధిస్తోందన్న కోపంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ సీరియస్ వార్నింగ్
భారత నౌకలపై దాడులు జరగడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని భారత విదేశాంగ శాఖ పిలిపించి గట్టిగా నిరసన తెలిపింది. సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతపై తమకు ఆందోళన ఉందని విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని భారత్ హెచ్చరించింది.

