అగ్నిపర్వతం పేలి.. ఊర్ల మీదికి లావా ప్రవాహం

V6 Velugu Posted on Sep 21, 2021

స్పెయిన్​: యాబై ఏండ్ల సంది నివురుగప్పిన నిప్పుల కొండలా ఉన్న ఆ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోయింది. ఒకటి కాదు.. రెండు క్రేటర్ల నుంచి దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల లావాను, బూడిదను వందల మీటర్ల ఎత్తుకు ఎగజిమ్మింది. కనీవినీ ఎరుగని రీతిలో బయటకు ఎగజిమ్ముకొస్తున్న లావా.. భగభగ మండుతున్న 8 నదుల్లా మారి కింద ఉన్న గ్రామాలపైకి దూసుకొస్తున్నది. గడ్డీ గాదం, చెట్టూ పుట్టా, ఇండ్లూ రోడ్లూ.. అడ్డొచ్చిన ప్రతిదీ బూడిదే. ఇప్పటికే 100 ఇండ్లు లావాకు ఆహుతైపోయినయి. వేలాది మంది జనం ఇండ్లు వదలి తరలిపోయిండ్రు. అట్లాంటిక్ సముద్రంలోని స్పెయిన్ కు చెందిన లా పాల్మా ఐల్యాండ్ లో ఆదివారం మొదలైన బీభత్సమిది. ఐల్యాండ్ లోని కంబర్ వీజా అగ్నిపర్వతం ప్రాంతంలో గత వారంరోజుల్లోనే 25 వేల భూకంపాలు వచ్చాయట. దీంతో భూమిలోని ఫాల్ట్ ల గుండా మాగ్మా, గ్యాస్ లు పైకి తన్నుకొచ్చినయి. తీవ్రమైన ప్రెజర్ పెరగడంతో అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా బద్దలైపోయింది. కొండపై అడవిని దహించివేస్తూ.. లావా ప్రవాహాలు కిందకు వస్తున్న మార్గాల్లోని ఇండ్లలో ఉన్న 5 వేల మందిని, పలు హోటళ్లలో ఉన్న 500 మంది టూరిస్టులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇప్పట్లో లావా ప్రవాహం ఆగే అవకాశం లేదని.. సుమారు రెండు నెలల పాటు లావా ఎగజిమ్ముతూనే ఉండొచ్చని చెప్తున్నారు. దీంతో అగ్నిపర్వతం పైనుంచి కిందకు వస్తున్న లావా నదులు.. సముద్రంలోకి కలిసే మార్గంలో ఇంకెన్ని ఇండ్లను బూడిద చేస్తాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tagged VILLAGES, Spain, lava, , Volcano, erupts, flows

Latest Videos

Subscribe Now

More News