రూ.30 లక్షలు చాలనేవాడు.. ధోనీ సీక్రెట్స్ బయటపెట్టిన వసీం జాఫర్

రూ.30 లక్షలు చాలనేవాడు.. ధోనీ సీక్రెట్స్ బయటపెట్టిన వసీం జాఫర్

టీమిండియా మాజీ సారథి మహేంద్రుడి సంపాదన నానాటికీ పెరుగుతోంది. ధోని.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్నా అతని పేరుకున్న బ్రాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కోహ్లీ తర్వాత భారత క్రికెటర్లలో అత్యధిక ఎండార్స్మెంట్స్ కలిగిన క్రికెటర్ ధోనీనే. కోకో కోలా, డ్రీమ్ 11, గో డాడీ, రీబాక్, ఓరియో.. ఇలా పలు వాణిజ్య సంస్థలకు ధోనినే బ్రాండ్ అంబాసిడర్. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం అతని సంపద రూ.1,040 కోట్లు. 

అలాంటి ధోనీ పదిహేనేళ్ల క్రితం రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు అనుకున్నాడట. ఎంఎస్ ధోని నేటితో 40 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల క్రితం ధోని కలలు ఎలా ఉండేవి..? ఎంత సంపాదించాలనుకున్నాడు? వంటి విషయాలను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ బయటపెట్టాడు. 

ALSO READ :పులి నోట్లో నుంచి బయటపడిన చిన్నారి.. కోలుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నాడు

రూ.30 లక్షలు చాలు.. హాయిగా బతికేస్తా! 

"నేను 2005లో తిరిగి జట్టులోకి వచ్చాను. ధోని 2004 చివరిలో (డిసెంబర్) వన్డే క్రికెట్‌లో ఎంట్రీ చేశాడు. అప్పుడప్పుడే వచ్చాడు కనుక ధోనీ.. జట్టుకు కొత్త. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుక కూర్చునేవాళ్ళం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ధోని, ఆర్పీ సింగ్, మేమంతా వెనుక సీట్లలో కూర్చునేవాళ్ళం. అందరం కలిసి కూర్చుంటాం కనుక ధోనీ.. నా భార్యతో బాగానే మాట్లాడేవాడు." 

"ధోని రైల్వేస్‌లో పని చేసేవాడని, క్రికెట్ ప్రాక్టీస్ కోసం అతను పడ్డ కష్టాల గురుంచి మనందరికీ తెలుసు. ఎంత కష్టపడ్డా కొన్ని సందర్భాల్లో ఆడే అవకాశాలు రావు. మొదట్లో అతను అలాంటివి పేస్ చేశాడు. రాంచీలో తాను జీవితాంతం ప్రశాంతంగా గడపడానికి 30 లక్షలు సంపాదిస్తే చాలని చెప్పేవాడు. రాంచీ వదలనని కూడా చెప్పేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడనుకోండి. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు..' అని జాఫర్ స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.