దేవాదుల ఆయకట్టుకు టన్నెల్ గండం .. పదేండ్లలో పూర్తి చేయని ఫలితం

దేవాదుల ఆయకట్టుకు టన్నెల్ గండం .. పదేండ్లలో పూర్తి చేయని ఫలితం
  • 4 లక్షల ఎకరాలకు అందని సాగునీరు
  • ఫేజ్ 1, ఫేజ్ 2 పైప్‌‌‌‌‌‌‌‌లైన్లతో ఏడాదికి 12 టీఎంసీల వినియోగానికే పరిమితం
  • టన్నెల్‌‌‌‌‌‌‌‌ పూర్తయితే 40 టీఎంసీల నీరు ఎత్తిపోసే అవకాశం
  • గోదావరి నీళ్లు అందక అరిగోస పడుతున్న రైతులు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : దేవాదుల టన్నెల్‌‌‌‌‌‌‌‌ పూర్తి కాకపోవడంతో గోదారి నీళ్ల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‒1, ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‒2 పైప్‌‌‌‌‌‌‌‌లైన్లతోనే వాటర్‌‌‌‌‌‌‌‌ సప్లై అవుతోంది. దీంతో ఏడాదికి కేవలం 12 టీఎంసీల వినియోగానికే దేవాదుల పరిమితమైంది. అదే టన్నెల్‌‌‌‌‌‌‌‌ వినియోగంలోకి వస్తే గోదావరి నుంచి ప్రతి యేటా 40 టీఎంసీల నీటి ఎత్తిపోసే అవకాశం ఉండేది. తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ టన్నెల్‌‌‌‌‌‌‌‌ పనులను పట్టించుకోకపోవడంతో అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. దీంతో వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ తర్వాత రెండో అతిపెద్ద టన్నెల్‌‌‌‌‌‌‌‌

దేవాదుల స్కీం థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద రామప్ప నుంచి ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌  వరకు రూ.1,410 కోట్లతో టన్నెల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేపట్టారు. 2008లో ఉమ్మడి ఏపీలోనే పనులు ప్రారంభం అయ్యాయి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌శాఖ చేపట్టిన రెండో అతి పెద్ద టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే. మొదట రామప్ప నుంచి ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ వరకు 54.88 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వాలని నిర్ణయించారు. భూ అంతర్భాగంలో 6 మీటర్ల వ్యాసార్థంతో టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తవ్వి 5.6 మీటర్ల వెడల్పుతో ‘డి’ షేప్‌‌‌‌‌‌‌‌లో టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేలా సిమెంట్‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయాలి. 

ఈ మేరకు హెచ్‌‌‌‌‌‌‌‌సీసీ, స్యూ, మెయిల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు జాయింట్‌‌‌‌‌‌‌‌ వెంచర్‌‌‌‌‌‌‌‌లో టెండర్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నాయి. నిర్మాణ పనుల బాధ్యతను సబ్‌‌‌‌‌‌‌‌ లీజ్‌‌‌‌‌‌‌‌పై కోస్టల్‌‌‌‌‌‌‌‌ కంపెనీకి అప్పగించారు. 2008 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 8న అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకోగా 2011 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌7 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ వద్ద బుంగపడి టన్నెల్‌‌‌‌‌‌‌‌లోకి నీళ్లు చొచ్చుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. అప్పటికే 42 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వి 15.52 కిలోమీటర్ల దూరం లైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయడంతో 53 శాతం పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ప్రమాదం తర్వాత కొన్నేండ్ల పాటు పనులు ఆగిపోయాయి.

తొమ్మిదేండ్లు పట్టించుకోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదేండ్ల పాటు పవర్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా దేవాదుల పనులను మాత్రం కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. 38 టీఎంసీలుగా ఉన్న దేవాదుల స్కీంను 60 టీఎంసీలకు పెంచారు. టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనుల బాధ్యతలను  ‘మేఘా’ సంస్థకు అప్పగించారు. టన్నెల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని సైతం 5.82 కిలోమీటర్లు తగ్గించి 49.06 కిలోమీటర్లకు కుదించారు. కొత్తగా 3.983 కిలోమీటర్ల మేర అప్రోచ్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌, 6.86 కిలోమీటర్ల దూరం 3 మీటర్ల వ్యాసార్థం కలిగిన మూడు పైప్‌‌‌‌‌‌‌‌లైన్ల నిర్మాణం, పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్జ్‌‌‌‌‌‌‌‌పూల్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్ నిర్ణయించింది.

 వర్క్‌‌‌‌‌‌‌‌ ఎస్టిమేషన్‌‌‌‌‌‌‌‌ను కూడా రూ.84 కోట్లకు పెంచి రూ.1,494 కోట్లుగా నిర్ధారించారు. మేఘా కంపెనీ కేవలం 7 కిలోమీటర్ల టన్నెల్‌‌‌‌‌‌‌‌ తవ్వి లైనింగ్‌‌‌‌‌‌‌‌ పనులను చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. దీంతో ఈ స్కీం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారని భావించినా నేటికీ ఎదురుచూపులే మిగిలాయి.

సాగు, తాగునీటిపై ప్రభావం

దేవాదుల స్కీంలో అతి కీలమైనది థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజే. ఇందులో థర్ఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ కింద చేపట్టిన రామప్ప టు ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నెల్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా ముఖ్యమైంది. ఇది పూర్తి చేస్తే ఏడాది పొడవునా 40 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకోవచ్చు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన ప్రాంతాలకు నీళ్లను అందిస్తున్నారు. ఈ రెండు దశల్లో కలిపి 12 టీఎంసీల గోదావరి నీళ్లను మాత్రమే ఎత్తిపోయడానికి వీలవుతోంది. థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 కింద చేపట్టిన పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ పనులు ఎప్పుడో కంప్లీట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. దీంతో గోదావరి నీళ్లు రామప్ప వరకు వస్తున్నాయి. 

ఇక మూడో దశలో చేపట్టిన టన్నెల్‌‌‌‌‌‌‌‌ పనులే చాలా ఏండ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఈ పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తే గోదావరి నీళ్లను వినియోగించుకునే వీలవుతోంది. తద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. అలాగే దేవాదుల స్కీం ఆధారంగా భీంఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చలివాగు, రామప్ప, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరువుల నుంచి మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీం ద్వారా వేలాది గ్రామాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తాగునీరందించవచ్చని అంటున్నారు. 

కానీ దేవాదుల టన్నెల్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి కాకపోవడంతో థర్డ్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో 40 టీఎంసీల నీరు ఉపయోగంలోకి రాకుండా పోతున్నాయి. ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని దేవన్నపేట దగ్గర నిర్మిస్తున్న షాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దగ్గర సరైన గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడం వల్ల విపరీతమైన సీపేజీ (నీటి ఊటలు) వచ్చి పనులకు అంతరాయం కలుగుతోందని, దీని వల్ల ఇంకా కిలోమీటర్‌‌‌‌‌‌‌‌ వరకు టన్నెల్‌‌‌‌‌‌‌‌ తవ్వే పనులు తరుచూ ఆగిపోతున్నాయని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.