పాక్​, బంగ్లా బార్డర్లలో సెక్యూరిటీ పెంచుతం : అమిత్ షా

పాక్​, బంగ్లా బార్డర్లలో సెక్యూరిటీ పెంచుతం :  అమిత్ షా

హజారీబాగ్ (జార్ఖండ్) : రాబోయే రెండేండ్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ బార్డర్లో పూర్తి సెక్యూరిటీ పెంచుతామని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు సరిహద్దుల వెంట  60 కిలోమీటర్ల పొడవున ఖాళీలను పూడ్చే పని జరుగుతోందని తెలిపారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)  59వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జార్ఖండ్ లోని మేరు శిక్షణా శిబిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్​షా  మాట్లాడారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేండ్లలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె వేసి, ఖాళీలను పూడ్చామని చెప్పారు. మరో 60 కి.మీ. మాత్రమే పని మిగిలి ఉందని, వచ్చే రెండేండ్లలో ఈ రెండు సరిహద్దుల్లో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేపడతామని అమిత్​ షా చెప్పారు. అలాగే, "సరిహద్దు కంచె మాత్రమే దేశాన్ని రక్షించదని, ధైర్యవంతులైన బీఎస్​ఎఫ్​ జవాన్​లే ఈ పనిని చేస్తున్నారు..” అని ఆయన తెలిపారు. దేశంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టి సమయంలో..  మాజీ ప్రధాని వాజ్‌పేయి నుంచి మోదీ ప్రభుత్వం వరకు సరిహద్దు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.