ప్రతి పక్షాలకు మమతా బెనర్జీ లేఖ

ప్రతి పక్షాలకు మమతా బెనర్జీ లేఖ

పశ్చిమ బెంగాల్: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీ నేతలు, బీజేపీ యేతర సీఎంలకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ నెల 15న ఢిల్లీలోని  కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా మొత్తం 22 మందికి మమతా లేఖ రాశారు.

ఈ సందర్భంగా దేశాన్ని విభజిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలు ఏకం కావాలని మమతా లేఖలో పేర్కొన్నారు. ప్రతి పక్షాలపై కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ నేతల మతతత్వ పోకడలతో దేశంలో చేదు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, విదేశాల్లో కూడా  దేశం పరువుపోతోందని మమతా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు కలిసికట్టుగా పోరాడాలని కోరారు. సమావేశానకి హాజరు కావాల్సిందిగా మమతా కోరారు.