
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా థర్మల్, హైడల్ కేంద్రాలపై ప్రస్తుతం ఆధారపడుతున్నది. సోలార్ ఇంధన ఉత్పత్తికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ముడిసరుకు బొగ్గు. హైడల్ విద్యుత్ ఋతుపవనాలు, వర్షాలు, ప్రాజెక్టులు నిండినపుడే సాధ్యపడుతుంది.
అది కూడా ఏడాదిలో గరిష్టంగా నాలుగు నెలలపాటు పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధ్యపడుతుంది. ఇక థర్మల్ విషయానికి వద్దాం. ఈ భూప్రపంచంలో ఇంకా 1,070 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఒక అంచనా. భారతదేశంలో అయితే కేవలం 111 బిలియన్ టన్నులు మాత్రమే బొగ్గు ఉందని చెపుతున్నారు.
మరి ఇలా తవ్వుకుంటూ పోతే బొగ్గు ఏమేరకు మన అవసరాలు తీరుస్తుంది. ఇంకా ఎన్నేళ్లపాటు బొగ్గు లభ్యమవుతుందన్నది ఒక ప్రశ్న. బొగ్గు నిల్వలు పూర్తిగా అయిపోయిన తర్వాత లక్షల కోట్లతో నిర్మాణం చేసుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల భవిష్యత్తు, వాటిపై ఆధారపడిన ఉద్యోగుల జీవితం ప్రశ్నార్థకం కాగలదు. తదనంతరం మన డిమాండ్ అవసరాలు తీరాలంటే ఏం చేయాలి?
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండేది. గత పన్నెండేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లు, ఎన్టీపీసీ లాంటి జాతీయ థర్మల్ కేంద్రాల నుంచి వచ్చే రాష్ట్రవాటా కలుపుకొని దాదాపు 21 వేల మెగావాట్లకు చేరువలో ఉన్నాం. అందులో సోలార్ వాటా 5200 మెగావాట్లు. ఇవి కూడా మన అవసరాలకు సరిపోని పరిస్థితుల్లో వేసవి డిమాండును పరిగణనలోకి తీసుకుని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి సదరన్ ఎక్సేంజ్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నది.
అందుకోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇది నిజంగా ఖజానాపై అదనపు భారంగా మారింది. ముఖ్యంగా మార్చి 20, 2025న ఆల్ టైమ్ రికార్డు డిమాండ్ 17162 మిలియన్ యూనిట్లు నమోదు కావడం విశేషం. ఇది భవిష్యత్తులో మరొక శిఖర స్థాయిని తాకుతుందనడంలో సందేహం లేదు.
విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలేమిటి?
ప్రపంచం మొత్తం నేడు సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టి, పర్యావరణ పరిరక్షణపై కంకణం కట్టుకున్నది. రాబోయే కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు స్వస్తి చెప్పి కాలుష్యం, కర్బన ఉద్గారాలను కనీసస్థాయికి తగ్గించి పర్యావరణ పరిరక్షణతో ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచి వారి ఆయుర్దాయం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో కనీసం 300 రోజులపాటు సూర్యరశ్మి పుష్కలంగా అందుబాటులో ఉంటున్నది. మనకు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఇదొక అనుకూల పరిణామం.
సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏమున్నాయి?
పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన... ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రవేశపెట్టింది. గృహాల పైకప్పులపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసి కరెంటు బిల్లును ఆదా చేసుకోవచ్చు. ఒక కిలో వాట్ కి రూ.50–- 60 వేల ఖర్చు అవుతుంది. ఈ పథకం ద్వారా మూడు కిలోవాట్ల వరకు అయ్యే ఖర్చు మొత్తం 1 లక్ష 80 వేలలో రూ.78 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. మిగతావి వినియోగదారుడు భరించాలి.
3 కిలోవాట్ల పైన ఎంత సామర్థ్యం అమర్చుకున్నా గరిష్ట సబ్సిడీ రూ.78 వేలకి మించదు. 3 కిలోవాట్ల ప్యానెల్స్ ద్వారా రోజుకు 12-–15 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నెలకు సరాసరి 300 యూనిట్లు ఖాయం. ఇది అందుబాటులో ఉండే సూర్యరశ్మి, సోలార్ పలకల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే నెలకు విద్యుత్ బిల్లు రూపేణా చూస్తే రూ.2 వేలు ఆదా అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడి ఆరేడు సంవత్సరాల్లో వాపసు వస్తుంది. అనంతరం 25 ఏండ్లపాటు మనకు లాభాలు పంచుతాయి.
ఎలా నమోదు చేసుకోవాలి?
పీఎం - సూర్య ఘర్ యోజన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. సంబంధిత డిస్కం ఆపరేషన్ ఏడీఈ పరిశీలించి ఫీజిబిలిటీ ఇస్తారు. తర్వాత తను ఎంచుకున్న వెండర్ ద్వారా సౌర పలకాలు ఏర్పాటు చేయించుకున్న తర్వాత మరోసారి పని పూర్తయిందని నిర్ధారించుకున్న తర్వాత నెట్ మీటర్ బిగించి బిల్లింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. మనం వాడగా మిగిలిన యూనిట్లు గ్రిడ్‌కు ఎక్స్పోర్ట్ అవుతాయి. వాటికి డిస్కంలు రూ.5.27 చొప్పున లెక్కగట్టి విని యోగదారునికి ఏటా జూన్, డిసెంబర్ మాసాల్లో చెల్లిస్తాయి.
పీఎం - కుసుమ్
పీఎం కుసుమ్ ( ప్రధాన్ మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మాహాభియాన్).. ఈ పథకం ప్రధాన ఉద్దేశం రైతులకు సాగుకు వాడుతున్న డీజిల్ ఇంజన్ల నుంచి విముక్తి, నమ్మకమైన విద్యుత్, హరిత ఇంధన ఉత్పత్తికి ప్రోత్సాహం, అదనపు ఆదాయం, దేశ సోలార్ ఇంధన ఉత్పతి పెంపుదల మొదలగునవి. ఇందుకు రూ.34,422 కోట్లు కేటాయించి, 34,800 మెగావాట్ల విద్యుత్ ను మార్చి 2026లోగా ఉత్పత్తికి లక్ష్యంగా నిర్ణయించారు.
రైతులు ఇప్పటికే పంటకు అక్కరకు రాని తమ పడావు భూముల్లో చాలా సబ్స్టేషన్ల పరిధిలో నమోదు చేసుకొని పీపీ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. 4 ఎకరాలు ఉంటే 1 మెగావాట్ ఉత్పత్తి చేయవచ్చు. ఆ భూమి సబ్‌స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇందుకు యూనిట్ ఒక్కంటికి తెలంగాణ రాష్ట్రంలో రూ.3.13 రైతుకు చెల్లిస్తారు. ప్రాజెక్టుకు అయ్యే రూ.7-–8 కోట్ల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్లు 6 శాతం వడ్డీపై ప్రోత్సాహకం అందిస్తోంది. మిగతా బ్యాంకు రుణం, సొంత డబ్బు వెచ్చించాలి.
ఎవరు సంధానకర్తలు?
ఈ పథకాల మంజూరు, అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంధనశాఖ ద్వారా రెడ్కో సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ప్రతి జిల్లాలో ఆ శాఖ మేనేజర్ సలహాలు, సూచనలు అందజేస్తూ ప్రాజెక్టుల పర్యవేక్షణ చేస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో హరిత ఇంధన ఉత్పత్తిపై దృష్టి పెట్టినా సామాన్య ప్రజల్లో ఏమాత్రం వీటిపై చర్చ జరగడం లేదు. అందుకు కారణం వీటితో తమకు ఒరిగే ప్రయోజనం తదితర వివరాలు తెలిపే యంత్రాంగం లేదు. విరివిగా అవగాహనా సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన నాడు ఈ పథకం ఉద్దేశం నెరవేరుతుంది. ఈ ఏడు రాష్ట్రంలో కనీసం 25 లక్షల గృహాలపై సరాసరి 2 కిలోవాట్ల సౌర ఫలకాల ఏర్పాటు లక్ష్యం నిర్దేశించుకుంటే 5 వేల మెగావాట్ల అదనపు సౌర విద్యుత్ రాష్ట్రం ముంగిట్లో ఉండటం ఖాయం. దేశంలో తెలంగాణ సౌర వెలుగుల్లో ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచిపోతుంది.
అసలెందుకు రికార్డుస్థాయి డిమాండ్?
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సరళీకృత, పారదర్శక, వేగవంతమైన పారిశ్రామిక విధానం వల్ల ప్రపంచంలో పెట్టబడులకు ఇదొక గమ్యస్థానంగా మారింది. ప్రపంచంలో మొదటి పది స్థానాల్లో ఉన్న, సుమారు 1-4 ట్రిలియన్ డాలర్ల విలువైన పెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్, యాక్సెంచర్, ఒరాకిల్, మెటా మొదలగునవి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద క్యాంపస్ లు మన రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహించడానికి కారణం ఇక్కడి నాణ్యమైన విద్యుత్, సమశీతోష్ణ పరిస్థితులు, చవకగా దొరికే మానవ వనరులు.
ఇలాంటి సేవారంగంలో పనిచేస్తున్న 9.5 లక్షల ఉద్యోగుల విద్యుత్ అవసరాలు తీర్చడం కూడా మన బాధ్యత. ఈ సదుపాయాలు మనం ఎప్పటికప్పుడు కల్పించినట్లయితే సంపద సృష్టి జరుగుతుంది. ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులతో ఇది నిరూపితమైంది. హైదరాబాద్ మరో సిలికాన్ వ్యాలీగా రూపాంతరం చెంది బెంగళూరును వెనక్కి నెట్టేసింది.
- దురిశెట్టి మనోహర్,
రిటైర్డ్ ఏడీఈ