
- సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన
- సరిహద్దుల్లో యుద్ధవిమానాల మోహరింపు.. అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సిల్
- సింధూ జలాల అగ్రిమెంట్ రద్దును ‘యాక్ట్ ఆఫ్ వార్’ అంటూ కామెంట్
- టెర్రరిస్టుల పనిపట్టేందుకు ఇప్పటికే ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా
- అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు
- వాఘా బార్డన్ను మూసివేస్తున్నట్లు వెల్లడి
- తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్లిపోవాలని ఆదేశం
- భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన
- కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలుతిప్పికొట్టేందుకు మన దేశం రెడీ
- ‘సీ స్కిమ్మింగ్’ టెస్ట్ సక్సెస్.. ఆక్రమణ్’ పేరిట సైనిక విన్యాసాలు
- అలర్ట్‌గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం కేంద్రానికి మద్దతిస్తామన్న అన్ని పార్టీలు
న్యూఢిల్లీ: కాశ్మీర్లో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులపై యావత్ భారత్ నిప్పులు చెరుగుతుంటే.. పాకిస్తాన్ మాత్రం మన దేశంపై యుద్ధానికి కాలుదువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నది. బరితెగింపు చర్యలకు దిగుతున్నది. ఇరు దేశాల మధ్య శాంతి కోసం 1972లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. ఇండియాతో ఎలాంటి వాణిజ్య, వ్యాపార సంబంధాలు ఉండబోవని.. గతంలోని అన్ని అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇండియా విమానాలను తమ భూభాగంలోకి అనుమతించబోమని, తమ దేశంలో ఉన్న భారతీయులు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించింది. సింధూ జలాల ఒప్పందం రద్దును ‘యాక్ట్ ఆఫ్ వార్’ అని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లో యుద్ధవిమానాల మోహరింపు, క్షిపణి ప్రయోగాలకు రంగం సిద్ధం చేసుకుంది. పహల్గాం టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, టెర్రరిస్టులకు వంతపడుతున్నవాళ్లను వదిలేది లేదని ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు దౌత్య పరంగా బుద్ధిచెప్పేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇలాంటి సమయంలో సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేసింది. పాక్ చర్యలను బలంగా తిప్పికొట్టేందుకు భారత్ రెడీ అవుతున్నది.
కాగా, దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అన్ని పార్టీలు ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. దేశమంతా ఒక్కతాటి మీద ఉంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో పేర్కొన్నాయి.
‘యాక్ట్ ఆఫ్ వార్’ అంటూ అన్ని ఒప్పందాలు రద్దు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఏరియాకు ఐదు కిలో మీటర్ల దూరంలోని బైసరన్‌లో పర్యటిస్తున్న టూరిస్టులపై ఈ నెల 22న ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన ఐదారుగురు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడటం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తామే కాల్పులు జరిపామని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధం సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. టెర్రరిస్టుల కోసం వేట మొదలుపెట్టింది. జమ్మూకాశ్మీర్ మొత్తం బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ.. పహల్గాం టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. టెర్రరిస్టులను, వాళ్లను ప్రోత్సహిస్తున్నవాళ్లను వదిలేది లేదంటూ.. ఐదు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు, ఇండియాలోని పాకిస్తానీలు వెళ్లిపోవాలని, పాక్ హైకమిషన్‌లోని ఆఫీసర్లు వెనక్కి పోవాలని, అటారీ బార్డర్ ను మూస్తున్నామని ప్రకటించింది. పాకిస్తాన్‌ను దౌత్య పరంగా దెబ్బతీసేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది. దీంతో కంగుతిన్న పాకిస్తాన్.. మరోసారి కవ్వింపు చర్యలను స్టార్ట్ చేసింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన గురువారం భేటీ అయిన అక్కడి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్సీ) బెదిరింపులకు దిగింది. సింధూ జలాల ఒప్పందం రద్దును యుద్ధ చర్యగా వ్యాఖ్యానించింది.
ఇండియాతో వాణిజ్య, ద్వైపాక్షిక ఒప్పందాలు, సిమ్లా ఒప్పందం, ఎయిర్‌స్పేస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘సిమ్లా ఒప్పందంతో పాటు భారత్‌తో అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను పాకిస్తాన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నది” అని ఎన్ఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాఘా సరిహద్దు పోస్ట్‌ను మూసేస్తున్నట్లు వెల్లడించింది. తమ దేశంలోని ఇండియన్స్ వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్ వీసాతో తమ దేశానికి వచ్చిన భారతీయులు 48 గంటల్లో వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. సిక్కు యాత్రికులకు మినహాయింపు ఇచ్చింది. ఇండియన్ హైకమిషన్ ఆఫీసర్లు వెళ్లిపోవాలని ఆదేశించింది. హైకమిషన్‌లో స్టాఫ్‌ను 30కి కుదిస్తున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి భారతీయ విమానాలను అనుమతించబోమని చెప్పింది. సింధూ జలాల ఒప్పందం 24 కోట్ల మంది పాకిస్తానీల జీవనాధారమని.. తమ నీటి హక్కులను కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని తెలిపింది. ఉగ్రవాదాన్ని తామూ ఖండిస్తున్నామని.. కానీ, తమ దేశానికి ఇబ్బందులు పెట్టే ఏ చర్యనూ సహించబోమని పాక్ పేర్కొంది. కరాచీ తీరంలోని క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో మిలటరీని మోహరించింది. పాక్ ఆర్మీకి సెలవులు రద్దు చేసింది.
తిప్పికొట్టేందుకు ఇండియా రెడీ
పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు ఇండియా రెడీ అవుతున్నది. పహల్గాం టెర్రర్ అటాక్‌కు బాధ్యులైన వారిని పట్టుకునేందుకు జమ్మూకాశ్మీర్‌లో అణువణువునూ గాలిస్తున్నది. అలర్ట్‌గా ఉండాలిన భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులనే కాదు.. టెర్రరిజాన్ని ప్రోత్సహించేవాళ్లను కూడా సహించేది లేదని తేల్చిచెప్పింది. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ కలిశారు. పహల్గాం ఘటన, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పహల్గాం టెర్రర్ అటాక్‌ను అమెరికా, రష్యా సహా అన్ని దేశాలు ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని తెలిపాయి.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ..జీ 20లోని పలు దేశాల రాయబారులతో సమావేశమైంది. ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. ఇందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, చైనా దేశాల రాయబారులు పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్‌ను నిర్వహించింది. కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు ముక్తకంఠంతో తెలిపాయి. టెర్రరిజాన్ని తుద ముట్టించాల్సిందేనని తేల్చిచెప్పాయి. అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలతో ఇండియా ‘ఆక్రమణ్’ పేరుతో వైమానిక విన్యాసాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా భూతలంపై కచ్చితత్వంతో దాడులు చేయడం, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డ్రిల్స్ వంటివి చేపట్టడంలో భాగంగా ఈ కసరత్తు చేపట్టింది. మరోవైపు సింధూ జలాల ఒప్పందం రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది.