ఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి.. రూ.21 లక్షలు గెలుచుకుంది

ఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి.. రూ.21 లక్షలు గెలుచుకుంది
  • భారత సంతతి బాలిక ఘనత

వాషింగ్టన్ :  ఇంట్లో అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించే  ఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి భారత సంతతి బాలిక ప్రతిష్టాత్మక అవార్డ్ ను సొంతం చేసుకుంది. థర్మో ఫిషర్ జూనియర్ ఇన్నోవేటర్స్ చాలెంజ్ లో 12 ఏండ్ల శాన్య గిల్ రూ.21 లక్షలను గెలుపొందింది. 65 వేల మందితో పోటీపడి ఆమె ఈ అవార్డును గెలుపొందింది. శాన్య కనుగొన్న పరికరంతో 90 శాతానికి పైగా అగ్ని ప్రమాదాలకు అరికట్టవచ్చు.  సాధారణ స్మోక్ డిటెక్టర్ కంటే  మెరుగ్గా  ఈ డివైస్ పని చేస్తుంది.

గతేడాది వేసవిలో శాన్య ఇంటి సమీపంలోని రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అటువంటి ఘటన తమ ఇంటిలో  చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టామని శాన్య చెప్పింది.  అదే సమయంలో థర్మల్ కెమెరాలతో ఇంటిలో చోటు చేసుకునే అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చని గుర్తించింది. ఈ కెమెరాలను కంప్యూటర్ కు అనుసంధానం చేసి ఫైర్ డిటెక్షన్ డివైస్ ను రూపొందించింది. మంటలు వస్తే అది వార్నింగ్ మెసేజ్ లను పంపించే విధంగా ప్రోగ్రామింగ్ చేసింది. ఈ డివైస్ తో ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోకుండా రక్షించవచ్చని ఆమె పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న శాన్య ప్రస్తుతం మిడిల్ స్కూల్ చదువుతోంది.