సుప్రీంకోర్టేమీ పోస్టాఫీసు కాదు.. జస్టిస్ వర్మపై సుప్రీం బెంచ్ఫైర్

సుప్రీంకోర్టేమీ పోస్టాఫీసు కాదు.. జస్టిస్ వర్మపై సుప్రీం బెంచ్ఫైర్

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌‌‌‌‌హౌస్ ఎంక్వైరీ ప్యానెల్ విచారణకు ముందే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఇన్-హౌస్ ఎంక్వైరీ ప్యానెల్ ఇచ్చిన రిపోర్టును సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ప్యానెల్ విచారణకు హాజరైన తర్వాత, ఆ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేయడమేంటని జస్టిస్ వర్మను నిలదీసింది.  

జస్టిస్ వర్మను తొలగించాలని కమిటీ ఇచ్చిన నివేదిక రాజ్యాంగ విరుద్ధమని, దానికి సిఫార్సులు చేసే అధికారం లేదని, ఈ కేసు పొలిటికల్‌‌‌‌‌‌‌‌గా మారిందని లాయర్ కపిల్ సిబల్ వాదించగా.. కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘చీఫ్ జస్టిస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ అంటే పోస్టాఫీస్ కాదు. న్యాయవ్యవస్థకు నాయకుడిగా దేశానికి సంబంధించి ఆయనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దుష్ప్రవర్తనకు సంబంధించిన నివేదికలు తన వద్దకు వచ్చినప్పుడు.. వాటిని రాష్ట్రపతి, ప్రధానికి పంపాల్సిన బాధ్యత సీజేఐపై ఉంది” అని తెలిపింది.