ఇందిరా గాంధీ ధైర్యంలో సగం కూడా మోదీకి లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఇందిరా గాంధీ ధైర్యంలో సగం కూడా మోదీకి లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • సీజ్​ఫైర్​పై రాహుల్, ప్రియాంక ప్రశ్నలకు ప్రధాని దగ్గర ఆన్సర్ లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ప్రాణాలతో కేంద్రంలోని బీజేపీ  సర్కారు రాజకీయం చేస్తోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. పాకిస్తాన్​కు బుద్ధి చెప్పే విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న ధైర్యంలో సగం కూడా  ప్రస్తుత ప్రధాని మోదీకి లేదని విమర్శించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మకర్ ద్వార్ ముందు మీడియాతో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు.

ఉగ్రదాడి, తదుపరి పరిణామాలపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ  ప్రియాంక గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సరైన సమాధానం చెప్పలేక దాటవేశారన్నారు. లోక్ సభలో దాదాపు 2 గంటల ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో స్పష్టత లేదని విమర్శించారు. ‘‘సీజ్​ఫైర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పీఎం ఎందుకు ఖండించలేదు? పాకిస్తాన్ విజ్ఞప్తితో సీజ్​ఫైర్​కి ఒప్పుకోవడంలో మతలబు ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నేతృత్వంలో దేశం సురక్షితంగా లేదని పహల్గాం ఘటనతో యావత్ దేశానికి నిరూపితమైందన్నారు.

మంచిర్యాలలో వందేభారత్ హాల్టింగ్​ ఇవ్వండి

పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల స్టేషన్​లో వందే భారత్ ట్రైన్ ఆపాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, కేరళ ఎక్స్​ప్రెస్​కు కూడా హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం లోక్ సభ క్వశ్చన్ అవర్​లో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సింగరేణి కాలరీస్ ఉన్నాయని, సింగరేణి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల కోట్ల రెవెన్యూ రైల్వే శాఖకు వస్తున్నదన్నారు.

ఈ ప్రాంతంలో వందేభారత్, కేరళ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంతో కాలంగా కేంద్ర రైల్వే శాఖను కోరుతున్నట్టు సభలో ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల నుంచి కనెక్టివిటీ లేకపోవడంతో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని సానుకూలంగా స్పందించాలని సభా వేదికగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు.

అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ మాట్లాడుతూ.. వందేభారత్, కేరళ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లు మంచిర్యాలలో ఆపాలని ఇప్పటికే చాలాసార్లు  కోరామన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల తెలంగాణపై ప్రేమ లేదనే వాదన బలంగా వినిపిస్తోందని చెప్పారు. ‘మన తెలంగాణ బొగ్గు తీసుకెళ్లి ఆదాయం చేసుకుంటున్నారు. కానీ, మంచిర్యాలలో రైళ్లు ఆపడం లేదు. వెంటనే మంచిర్యాలలో వందేభారత్, కేరళ ఎక్స్​ప్రెస్ రైళ్లు ఆపాలి. లేదంటే మా నిరసనలు కొనసాగుతాయి. పెద్దపల్లికి రావాల్సిన హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగుతుంది’ అని అన్నారు.

కాగా, ఎంపీ వంశీ కృష్ణ లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రకటించారు. వందేభారత్, కేరళ ఎక్స్ ప్రెస్ మంచిర్యాలలో హాల్టింగ్​కు సంబంధించి విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.  ప్రస్తుతం 144 రూటల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయని, చాలా ప్రాంతాల నుంచి వందేభారత్ ట్రైన్లు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయని వివరించారు. ఇందులో తెలంగాణ నుంచి ఎంపీ కూడా తమ ప్రజల అవసరాన్ని సభలో ప్రస్తావించారన్నారు. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

గ్రీన్‌‌‌‌ పథకాలకు సింగరేణే ఖర్చు చేస్తున్నది

పెద్దపల్లి జిల్లాలో ఉన్న బొగ్గు గని ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ కార్యక్రమాలకు సింగరేణి సంస్థ ప్రాజెక్టు-ప్రత్యేక మైన్‌‌‌‌ క్లోజర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ మేరకు ఖర్చు చేస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి సహా ఇతర బొగ్గు పీఎస్‌‌‌‌యూస్‌‌‌‌లు తమ సొంత నిధులతో పర్యావరణ పునరుద్ధరణ, పచ్చదన కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. ఈ ప్రోగ్రామ్​ల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధు లేవీ కేటాయించడం లేదని స్పష్టం చేశారు.

ఈ మేరకు బుధవారం లోక్‌‌‌‌సభలో ఎంపీ వంశీ కృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చా రు. బొగ్గు, లిగ్నైట్‌‌‌‌ సంస్థలు 2024-25 నుంచి 2028-29 మధ్య 37,930 ఎక రాల్లో మొక్కలు నాటే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాయ న్నారు. ఇందులో భాగంగా 2024-25 ఏడాదిలో మొత్తం 6,076 ఎకరాల్లో మొక్కలు నాటగా, సింగరేణి తమ వాటాగా 1,361 ఎకరాల్లో మొక్కలు నాటిందని కిషన్‌‌‌‌ రెడ్డి తెలిపారు.