జూబ్లీహిల్స్  యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ కేసులో నిందితుడెవరు?

జూబ్లీహిల్స్  యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ కేసులో నిందితుడెవరు?
  • మిస్టరీగా మారిన కేసు.. కావాలనే ఆలస్యం చేస్తున్నరని ఆరోపణలు
  • ప్రమాద సమయంలో కారులో ముగ్గురు!
  • కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకా లేక వేరే వాళ్లా? అనే కోణంలో దర్యాప్తు

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ కారు ‌‌‌‌‌‌‌‌యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ కేసు మిస్టరీగా మారింది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా నిందితులను గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చేందుకే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాక్సిడెంట్ చేసింది ఎమ్మెల్యే షకీల్‌‌‌‌‌‌‌‌ కొడుకా లేక యాక్సిడెంట్​ సమయంలో ఉన్న అతని ఫ్రెండ్సా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్ 45లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండున్నర నెలల రణవీర్‌‌‌‌ చౌహాన్‌‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అశ్వతోష్‌‌, కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలు గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన వీళ్లంతా దుర్గం చెరువు కేబుల్‌‌ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ బెలూన్స్ అమ్ముకుంటున్నారు. గాయపడ్డ బాధితులను పోలీసులు నిమ్స్‌‌కి తరలించి చికిత్స అందించారు.

బంధువు కారుకి ఎమ్మెల్యే స్టిక్కర్‌‌‌‌
ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్‌‌ ఎమ్మెల్యే షకీల్‌‌ పేరుతో స్టిక్కర్‌‌ ఉంది. ఇది కాస్తా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కొడుకు లేదా డ్రైవర్‌‌‌‌ మద్యం మత్తులో కార్‌‌‌‌ డ్రైవ్‌‌ చేసి, యాక్సిడెంట్‌‌ చేసి ఉంటారని తొలుత ప్రచారం జరిగింది. దీంతో దుబాయ్‌‌లో ఉన్న ఎమ్మెల్యే షకీల్‌‌కు జూబ్లీహిల్స్‌‌ పోలీసులు కాల్‌‌ చేశారు. యాక్సిడెంట్‌‌ చేసిన కారు వివరాలు తెలుసుకున్నారు. టెంపరరీ రిజిస్ట్రేషన్‌‌ నంబర్ ఆధారంగా గతేడాది అక్టోబర్‌‌‌‌14న నిజామాబాద్‌‌లో కారు కొన్నట్లు గుర్తించారు. కింగ్‌‌ కోఠికి చెందిన మీర్జా అడ్రస్‌‌, అర్బన్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఇన్‌‌ఫ్రా కంపెనీ పేరుతో కారు రిజిస్టర్ అయ్యిందని తెలుసుకున్నారు.

కావాలనే అరెస్టు చేయలేదా?
యాక్సిడెంట్‌‌ జరిగిన టైమ్​లో డ్రైవింగ్‌‌ చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించామని బాధితులు చెప్పగా, డ్రైవర్ పారిపోయాడని పోలీసులు చెప్పారు. వెహికల్‌‌తో పాటు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ నిందితుల అరెస్ట్‌‌ విషయంలో జరిగిన ఆలస్యంపై విమర్శలు వస్తున్నాయి. కేబుల్‌‌ బ్రిడ్జి నుంచి యాక్సిడెంట్‌‌ స్పాట్‌‌ వరకు ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌లో నిందితులను గుర్తించలేకపోయినట్లు తెలిసింది. కారు బ్లాక్ ఫిల్మ్‌‌తో ఉండటంతో డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరు, ఎంతమంది ట్రావెల్ చేశారో తేల్చేందుకు పోలీసులకు సవాళ్లు ఎదురయ్యాయి. డ్రంకన్ డ్రైవ్ కండీషన్‌‌లో యాక్సిడెంట్‌‌ చేశారా అనేది తేల్చలేక పోయినట్లు సమాచారం. అయితే యాక్సిడెంట్​ సమయంలో కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం.

నిమ్స్‌‌ నుంచి బాధితులు గాయబ్
నిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న రణవీర్‌‌‌‌ చౌహాన్‌‌ తల్లి కాజల్‌‌ శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తర్వాత బాధితులు సారిక, సుష్మ కూడా హాస్పిటల్‌‌ నుంచి వెళ్లిపోయారు. తమకు సమాచారం ఇవ్వకుండానే వాళ్లు వెళ్లిపోయారని హాస్పిటల్‌‌ డ్యూటీ మెడికల్ సూపరింటెండెంట్‌‌ లక్ష్మీభాస్కర్‌‌ చెప్పారు. డిశ్చార్జ్ చేయలేదని తెలిపారు. ఓపీ కార్డుతో ట్రీట్‌‌మెంట్‌‌ ఇచ్చామని, ఓపీ షీట్‌‌ తీసుకుని పోయారని పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే షకీల్‌‌ సూచనలతో బాధితులకు మీర్జా ఫ్యామిలీ రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ డబ్బు తీసుకుని బాధితులు మహారాష్ట్ర వెళ్లిపోయినట్లు సమాచారం.

పిల్లాడిని తల్లే కిందపడేసింది
‘‘నిన్న జూబ్లీహిల్స్‌‌‌‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ కారు నా కజిన్ మీర్జాది. అదే కారును నేను కూడా వాడుకుంటుంటా. అందుకే స్టిక్కర్‌‌‌‌‌‌‌‌ అంటించా. గురువారం రాత్రి మీర్జా ఫ్యామిలీ కారులో వెళ్లారు. జూబ్లీహిల్స్‌‌‌‌లో యాక్సిడెంట్‌‌‌‌ జరిగినట్లు నాతో చెప్పారు. కొడతారనే భయంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. సిగ్నల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో అమ్మాయికి దెబ్బ తగిలింది. అప్పుడు ఆమె చేతిలో చిన్నారి ఉన్నాడు. ఆమె భయపడి కింద పడేయడంతో బాబు చనిపోయాడు. ఇది చాలా బాధాకరం. చట్ట ప్రకారం పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. యాక్సిడెంట్ గురించి మా కజిన్‌‌‌‌తో మాట్లాడాను. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని మా కజిన్ మీర్జాతో చెప్పాను. నా కొడుకు డ్రైవ్‌‌‌‌ చేశాడనేది అవాస్తవం’’
- బోధన్‌‌‌‌ ఎమ్మెల్యే షకీల్‌‌‌‌

‘‘ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే, పోలీస్‌‌‌‌, ప్రెస్‌‌‌‌ స్టిక్కర్లపై స్పెషల్‌‌‌‌ డ్రైవ్ నిర్వహిస్తం. అనర్హులను గుర్తించి కేసులు నమోదు చేస్తం. డార్క్ ఫిల్మ్స్‌‌‌‌, రేసింగ్‌‌‌‌, హెడ్‌‌‌‌లైట్‌‌‌‌ మాడిఫికేషన్‌‌‌‌ చేసే వెహికల్స్‌‌‌‌, సైరన్‌‌‌‌పై స్పెషల్‌‌‌‌ ఫోకస్ పెడుతం’’
- హైదరాబాద్‌‌‌‌ ట్రాఫిక్ చీఫ్‌‌‌‌ ఏవీ రంగనాథ్‌‌‌‌