మద్యం తాగేటప్పుడు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, లేదా పల్లీలు లాంటి కరకరలాడే స్నాక్స్ తినాలని ఎందుకు ఎక్కువగా అనిపిస్తుందో తెలుసా.. ? ఇది కేవలం అలవాటో లేక సరదాకో చేసే పని కాదు.. దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. మనం తాగే ప్రతి చుక్కా మన మెదడులో, శరీరంలో కొన్ని రసాయన చర్యలను మొదలుపెడుతుంది. అందుకే హెల్తీగా ఇంట్లో వండిన అన్నం తినాలనిపించదు కానీ, అర్ధరాత్రి అయినా సరే పిజ్జానో, ఫ్రెంచ్ ఫ్రైసో లాగించేయాలనిపిస్తుంది. అసలు మందు తాగినప్పుడు జంక్ ఫుడ్ తినాలనిపించడానికిగల టాప్ 5 కారణాలు ఏంటో చూద్దామా...
ఆకలిని పెంచుతుంది
చాలామంది మద్యం తాగితే కడుపు నిండిపోతుంది అనుకుంటారు. కానీ నిజానికి ఆల్కహాల్ శరీరంలోకి వెళ్ళాక ఆకలిని పెంచే మెదడు భాగాలను యాక్టివేట్ చేస్తుంది. పైగా తాగిన మత్తులో ఇది తినకూడదు, లావైపోతాం అనే కంట్రోల్ కూడా కోల్పోతాం. అందుకే ఒకటి రెండు పెగ్గులు పడగానే, ఇంకో ప్లేట్ ఆర్డర్ చేయడం చాలా నార్మల్ విషయంగా అనిపిస్తుంది.
కిక్ ఇచ్చే డోపమైన్
మద్యం తాగినప్పుడు మెదడులో 'డోపమైన్' అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది మనకు ఒకలాంటి కిక్ లేదా సంతోషాన్ని ఇస్తుంది. ఒకసారి ఈ సంతోషం రుచి చూశాక, మెదడు మరింత ఆనందం కోసం వెతుకుతుంది. ఉప్పగా, కారంగా, నూనెలో వేపిన జంక్ ఫుడ్ తిన్నప్పుడు కూడా మెదడుకు అదే కిక్ వస్తుంది. అందుకే మందు, ముక్క కాంబినేషన్ విడదీయలేనంత స్ట్రాంగ్‌గా మారిపోతుంది.
బాడీ డీహైడ్రేట్
ఆల్కహాల్ వల్ల మనకు ఎక్కువసార్లు యూరిన్ వస్తుంది. దీనివల్ల ఒంట్లో ఉన్న నీటితో పాటు, సోడియం లాంటి ముఖ్యమైన లవణాలు కూడా బయటకు పోతాయి. బాడీలో ఉప్పు శాతం తగ్గినప్పుడు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి శరీరం ఉప్పగా ఉండే చిప్స్, మిక్చర్ లాంటి పదార్థాలను కోరుకుంటుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్
మద్యం తాగినప్పుడు, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. ఇలా షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు మెదడుకు వెంటనే ఎనర్జీ కావాలి. మైదా, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే స్నాక్స్ తింటే ఇన్స్టంట్‌గా ఎనర్జీ వస్తుంది కాబట్టి, మన చేతులు ఆటోమేటిక్‌గా ఆ స్నాక్స్ వైపు వెళ్తాయి.
అలవాటైన సామాజిక వాతావరణం
మనం సాధారణంగా బార్లలో, పబ్బుల్లో, ఫ్రెండ్స్ రూమ్‌లలో లేదా పార్టీలలోనే తాగుతాం. అక్కడ చుట్టుపక్కల ఎప్పుడూ ఉప్పగా ఉండే నంచుకునే పదార్థాలే కనిపిస్తాయి. సినిమా థియేటర్‌కి వెళ్ళగానే పాప్‌కార్న్ గుర్తొచ్చినట్లు.. మందు గ్లాస్ చేతిలోకి రాగానే చిప్స్, ఫ్రైస్ తినాలనేది మన మెదడులో ఒక అలవాటుగా అయిపోయింది.
దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి
ఈ సైన్స్ ఏంటో మనకు అర్థమైంది కాబట్టి, తాగడానికి ముందే కాస్త హెల్తీగా కడుపు నిండా భోజనం చేయడం లేదా మధ్యమధ్యలో నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా అర్ధరాత్రి జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
