మహిళా రిజర్వేషన్​ బిల్లును ఆమోదించరా?

మహిళా రిజర్వేషన్​ బిల్లును ఆమోదించరా?

మన దేశ రాజకీయాల్లో మహిళలు అస్థిత్వం నిలుపుకోవాలంటే ఎన్నో దశాబ్దాలు పోరాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప, వారి అస్థిత్వం, హక్కులు, ప్రాణాలకు ఇక్కడ విలువే లేదు. మహిళలు రాజకీయాల్లో భాగస్వామ్యం తీసుకోకుండా రాజకీయ ఎత్తుగడలు, సర్దుబాట్లు, సమీకరణలతో సరిపుచ్చుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిర్ణయాధికారంలో మహిళలకు సమభాగస్వామ్యం కల్పించాలని అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు మొత్తుకుంటున్నాయి. కానీ దేశంలో మహిళా రిజర్వేషన్​ బిల్లు 25 ఏండ్లుగా ఆమోదం పొందడం లేదు.1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మహిళలకు మంచి రోజులు వచ్చినట్లు పేర్కొన్నారు. సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన ఘట్టమని ఊదరగొట్టారు. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదమే లభించలేదు.
ఈసారైనా ఆమోదం దక్కుతదా?
నిర్ణయాధికారంలో మహిళలకు సగ భాగస్వామ్యం అన్న నినాదం కాగితాలకే పరిమితం అవుతోంది. చట్టసభల్లో మగవారితో సమానం కాదు కదా కనీసం మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ పార్టీకీ చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతోంది. అందువల్లే ఆర్భాటంగా పార్లమెంట్​లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి 25 ఏండ్లు గడిచింది. ఇది అర్ధ ప్రపంచపు హక్కైనా దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రాజకీయాలు చిత్తశుద్ధి లేకుండా, మోసపూరితంగా, లింగ వివక్షతో ఉన్నాయి. చట్ట నిబంధనల ప్రకారం ఏ బిల్లు అయినా లోక్‌సభలో పెండింగ్‌లో ఉంటే సభ రద్దు అయిన తర్వాత కాలం చెల్లిపోతుంది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బిల్లు మరోసారి చర్చకు వచ్చింది. సరిగ్గా ఆ రోజునే పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలయ్యాయి. రాజ్యసభలో మహిళా ఎంపీలకు పలు అంశాలపై మాట్లాడటానికి అనుమతివ్వగా.. లోక్‌ సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఈ వర్షాకాల సమావేశాల్లోనైనా బిల్లుకు మోక్షం కల్పించాలని మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు.
చట్టసభల్లోభాగస్వామ్యం కోసం..
దేశ రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదన1975లో  తొలిసారిగా లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర విద్య, సాంఘిక సంక్షేమ శాఖ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ముందుగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించాలని ప్రతిపాదిస్తూ, వారికి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. 1993లో 73, 74వ అధికరణలను అనుసరించి నియోజకవర్గ చట్ట సవరణ చేశారు. దీని ప్రకారం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ కల్పించారు. 1996 సెప్టెంబర్12న మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశట్టింది అప్పటి దేవెగౌడ ప్రభుత్వం. అయితే ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడటంతో బిల్లు అటకెక్కింది.1998లో రెండోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది వాజ్​పేయి సర్కార్‌. పూర్తి గడువు తీరకుండానే లోక్‌సభ రద్దు కావటంతో మహిళా బిల్లు మరోసారి మరుగున పడింది. 1999 డిసెంబర్‌ 23న దిగువ సభలో బిల్లును ప్రవేశ పెట్టింది ఎన్‌డీఏ ప్రభుత్వం. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు గగ్గోలు పెట్టడంతో రాజకీయ ఏకాభిప్రాయం లేదంటూ వెనక్కి తగ్గింది. 2008లో మన్మోహన్​సింగ్ ప్రభుత్వం  మహిళా బిల్లును మళ్లీ తెర మీదికి తీసుకువచ్చింది. 14వ లోక్‌సభ గడువు ముగిసినా లేక రద్దయినా బిల్లు యాక్టివ్‌గా ఉండేలా మార్పులు చేశారు.
లోక్ సభలో పెండింగ్
2010 మార్చి 8న మహిళా రిజర్వేషన్​బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తీవ్ర వ్యతిరేకతల మధ్య అట్టుడుకిపోయే వాతావరణంలో మార్చి 9న బిల్లు ఆమోదం పొందింది. దీంతో చట్టసభలకు పోటీ చేసేందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కుతుందని అందరూ ఆశించారు. అయితే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల్లో గొడవలు జరిగాయి. బిల్లును అడ్డుకుంటామని పలువురు నేతలు ప్రకటించారు. బిల్లు విషయంలో మొండిగా ముందుకెళితే కాంగ్రెస్‌లో అసమ్మతి తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని కొందరు నేతలు బెదిరించారు. దీంతో ఆ బిల్లు లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది.
ఏకాభిప్రాయం ఈ బిల్లుకే ఎందుకు?
మహిళా రిజర్వేషన్​బిల్లు హామీతో ఐదుసార్లు అధికారంలోకి వచ్చిన యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ బిల్లు ఆమోదం పొందడం లేదు. ప్రైవేటీకరణ, బ్యాంకుల్లో వాటా, వడ్డీ తగ్గింపు, బీమా, కార్మిక రంగాల చట్ట సవరణ బిల్లు, సెజ్‌ చట్టం, అణు ఒప్పందం, పేటెంట్ చట్టం, ఎఫ్‌డీఐ, ఉపాధి చట్టం.. ఇలా ఎన్నో బిల్లులను ఏకాభిప్రాయం లేకున్నా ఆమోదం లభించింది. కానీ మహిళా బిల్లుకు మాత్రం ఏకాభిప్రాయం ఉండాలంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏ పార్టీ కూడా మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. మహిళా బిల్లుకు ఇప్పట్లో ఆమోదం లభించే సూచనలు లేవు కాబట్టి, సీట్ల కేటాయింపులోనేనా మహిళా కోటా అమలు చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. 
సీజేఐ కామెంట్లతోనైనా..
‘మహిళల్లారా ఏకం కండి. న్యాయ వ్యవస్థలో యాభై శాతం రిజర్వేషన్ల కోసం నిస్సహాయతతో కాక ఆగ్రహంతో గొంతెత్తండి. మీ డిమాండ్‌ను బలంగా వినిపించండి. చట్టసభల్లో రిజర్వేషన్లు దయతలచి ఇచ్చేవి కావు. అది మీ హక్కు’ అని సుప్రీంకోర్టులోని మహిళా లాయర్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మహిళా హక్కులనేవి వేల ఏండ్లుగా కొనసాగుతున్న అణచివేతకు సంబంధించిన అంశమని సీజేఐ అన్నారంటే సాంస్కృతికంగా మనదేశ స్థాయి ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ దేశాల్లో మనమెక్కడ?
ప్రపంచ దేశాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 22 శాతం ఉంది. మన దేశంలో సగటు ప్రాతినిధ్యం12 శాతమే. రువాండా లాంటి చిన్న దేశ చట్టసభల్లో 63.8 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. స్కాండినేవియన్ దేశాల్లో సగానికి ఎక్కువగా మహిళా ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ దేశాల్లో కూడా తమకు సముచిత ప్రాతినిధ్యం కావాలంటూ మహిళలు పోరాడుతున్నారు. చట్టసభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యంలో మనదేశం ప్రపంచంలో103 స్థానంలో ఉండటం బాధపడాల్సిన విషయం.

అల్జీరియా, దక్షిణ సుడాన్‌, లిబియా వంటి దేశాలు మనకంటే మెరుగ్గా మహిళలకు స్థానం కల్పిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇతర అరబ్​ దేశాల్లో కూడా మహిళలకు చట్టసభల్లో గణనీయమైన ప్రాతినిధ్యం దక్కుతోంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ తక్కువగా ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి.- వి.సంధ్య, నేషనల్  కన్వీనర్, పీవోడబ్ల్యూ.