కొడుకు కాలేజీ ఫీజు కోసం.. తల్లి ప్రాణత్యాగం

కొడుకు కాలేజీ ఫీజు కోసం.. తల్లి ప్రాణత్యాగం

చెన్నై: కొడుకు కాలేజీ ఫీజు కోసం ఓ తల్లి ప్రాణత్యాగం చేసింది. తాను చనిపోతే సర్కార్ నుంచి నష్టపరిహారం వస్తుందని, ఆ డబ్బుతో తన కొడుకు చదువు పూర్తవుతుందని భావించి.. బస్సు కింద పడి ప్రాణం తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది. పోయిన నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. సేలం జిల్లాకు చెందిన పాపతి(39) భర్త కొన్నేండ్ల కింద చనిపోయాడు. ఆమెకు బిడ్డ, కొడుకు ఉండగా.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. 

ప్రస్తుతం కలెక్టర్ ఆఫీసులో కాంట్రాక్టు స్వీపర్​గా పనిచేస్తోంది. బిడ్డ బీటెక్ చదువుతుండగా, కొడుకు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. కొడుకు కాలేజీ ఫీజు రూ.45 వేలు కట్టాలని పాపతిపై మేనేజ్​మెంట్ ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమె తెల్సినోళ్లందరి దగ్గర అప్పు అడిగి చూసింది. కానీ ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో, కొడుకు చదువు ఆగిపోతదని ఆందోళన చెందింది. ఈ క్రమంలో కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇస్తదని, పిల్లలను చదివిస్తదని ఎవరో పాపతిని తప్పుదోవ పట్టించారు. దీంతో తాను చనిపోయిన పర్వాలేదు గానీ, తన కొడుకు చదువు ఆగిపోకూడదని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

జూన్ 28న ఉదయం సేలంలోని అగ్రహారం కాలనీలో బస్సుకు ఎదురెళ్లింది. బస్సు ఢీ కొట్టడంతో స్పాట్​లోనే చనిపోయింది. మొదట యాక్సిడెంట్ కేసుగా భావించిన పోలీసులు.. సీసీ ఫుటేజీ చూసి ఆత్మహత్యగా తేల్చారు. అయితే, తన తల్లి ఆత్మహత్యపై వస్తున్న వార్తలు నిజం కాదని పాపతి కొడుకు చెప్పాడు. కాలేజీ ఫీజు కట్టేందుకు తమ బంధువులు సాయం చేస్తున్నారని తెలిపాడు.