సీట్లిస్తేనే ఇంటింటి ప్రచారం చేస్తం..కాంగ్రెస్ ​కు తెలంగాణ మహిళా నేతల అల్టిమేటం

సీట్లిస్తేనే ఇంటింటి ప్రచారం చేస్తం..కాంగ్రెస్ ​కు తెలంగాణ మహిళా నేతల అల్టిమేటం

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా నేతలకు టికెట్లు ఇవ్వకపోతే ఇంటింటి ప్రచారం చేయబోమని పార్టీ హైకమాండ్ కు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు అల్టిమేటం ఇచ్చారు. మహిళలకు సీట్లు ఇవ్వకపోతే మహిళా కాంగ్రెస్ లోని అక్కా, చెల్లెల్లు ఎవరూ ఓట్ల కోసం తిరగొద్దని తీర్మానం చేశారు. ఢిల్లీలోని తాలక్టోరా స్టేడియంలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల మహిళా కాంగ్రెస్ జాతీయ సదస్సు సమావేశాలు శుక్రవారం ముగిశాయి. సమావేశాల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ– ఏపీతో పాటు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ మహిళా నేతలు పాల్గొన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలకు ఈ సదస్సు ద్వారా ఖర్గే దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. 

మాకెన్ని సీట్లిస్తారు?: సునీతా రావు 

వచ్చే ఎన్నికల్లో మహిళలకు టికెట్లు నిరాకరించిన చోట్ల ప్రచారానికి తిరగబోమని పార్టీ హైకమాండ్ కు తేల్చిచెప్పామని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు వెల్లడించారు. మహిళల సాధికారత గురించి మాట్లాడం కాదు.. తమకు ఎన్ని సీట్లు ఇస్తారో ముందు చెప్పాలని అధిష్టానాన్ని గట్టిగా అడిగామన్నారు.